Breaking News

ఇదో కొత్త అనుభూతి

భారత స్ప్రింటర్​ ద్యుతీ చంద్

న్యూఢిల్లీ: పెద్ద స్టేడియం.. చుట్టూ పచ్చదనం.. ఆహ్లాదకరమైన వాతావరణం… చల్లని గాలులు.. మధ్యలో రన్నింగ్ ట్రాక్.. కూత వేటు దూరంలో ఎవరూ కనిపించడం లేదు.. రెండు నెలల తర్వాత ఔట్ డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత స్ర్పింటర్ ద్యుతీ చంద్ తొలి రోజు ఫీలింగ్ ఇది. లాక్​ డౌన్​తో రూమ్​ కే పరిమితమైన తనకు ఈ అనుభవం చాలా కొత్తగా అనిపిస్తోందని చెప్పింది. ‘రెండు నెలల తర్వాత ట్రాక్‌ మీద పరుగెత్తుతూ చల్లగాలిని పీల్చడం కొత్త అనుభూతి ఇస్తోంది.

ట్రాక్‌ అథ్లెట్లకు ఇంతకంటే బెటర్‌ ఫీలింగ్‌ ఉండదేమో. కానీ మైదానంలో ఎవరూ లేకపోవడంతో వింత శబ్దాలతో అసాధారణంగానూ అనిపించింది. సాధారణ రోజుల్లో ఈ స్టేడియంలో చాలామంది అథ్లెట్లు ప్రాక్టీస్‌ చేస్తుంటారు. కరోనాతో అందరూ ఊళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు నేనొక్కదానినే ప్రాక్టీస్‌ చేయడంతో వింతగా అనిపిస్తోంది’ అని ద్యుతీ పేర్కొంది. తన కోచ్ రమేశ్ కుమార్ సలహాలతో ప్రాక్టీస్ బాగా కొనసాగుతుందని వెల్లడించింది. రన్నింగ్ కు దూరంగా ఉండి చాలాకాలం కావడంతో కండరాలు బాగా పట్టేశాయని పేర్కొంది. పూర్తివేగాన్ని అందుకోవడానికి రెండునెలల సమయం పడుతుందని చెప్పింది.