Breaking News

కోరమీసాల మల్లన్న కోటి దండాలు

కోరమీసాల మల్లన్నకోటి దండాలు

  • కొమురెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • 13 వారాల పాటు జానపదుల జనజాతర

సారథి న్యూస్, హుస్నాబాద్: తెలంగాణ, జానపద సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచి.. అరుదైన పడమటి శివాలయంగా పేరొందిన కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మెత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏటా మార్గశిరమాసం చివరి ఆదివారం నిర్వహించే స్వామివారి కల్యాణ వేడుకతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. జనవరి 10న ప్రారంభమయ్యే ఉత్సవాలు మూడు నెలల పాటు 13వారాలు కొనసాగి ఫాల్గుణ మాసం ఆదివారం ఏప్రిల్ 11న అగ్నిగుండాల కార్యక్రమంతో ముగిస్తాయి. పట్నంవారం, లష్కరవారం, మహాశివరాత్రి సందర్భంగా పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలు జాతరలో ప్రధానఘట్టాలుగా నిలుస్తాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అయితే కోరమీసాల కొమురెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని, శానిటైజర్ వెంట తెచ్చుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మాస్కులు కట్టుకోవాలని, ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని ఆలయాధికారులు భక్తులకు సూచిస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమాలు
జనవరి 10: స్వామివారి కల్యాణోత్సవం
మార్చి 11: మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవం, అభిషేకార్బనలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పల్లకీసేవ, పెద్దపట్నం
మార్చి 12: ఏకాదశ రుద్రాభిషేకం, అన్నపూజ
మార్చి 26: కాముడి దహనం
మార్చి 28: వసంతోత్సవం(హోలీ వేడుకలు)
ఏప్రిల్​11: వీరభద్ర ప్రస్తాయం, భద్రకాళిపూజ, రాత్రి అగ్నిగుండ ప్రజ్వలన
ఏప్రిల్​12: తెల్లవారుజామున గురుపూజ, బలిహారతి, అగ్నిగుండప్రవేశం, విజయోత్సవం. ఏకాదశ రుద్రాభిషేకం, జంగమార్చన మహదాశీర్వచనం.

కొమురవెల్లి ఆలయం వ్యూ

ఆలయ సుందరీకరణ పనులు పూర్తి
కొద్దిరోజుల క్రితల ఆలయ అధికారులు అలంకరణలో భాగంగా రాజగోపురానికి విద్యుత్ దీపాలను అలంకరించారు. కల్యాణం నిర్వహించనున్న తోటబావి ప్రాంగణంతో పాటు మహామండపాన్ని పంచరంగులు వేసి శోభాయమానంగా తీర్చిదిద్దారు. కల్యాణ మండపం వద్ద స్టీల్ గ్రిల్స్, బారీకేడ్ పనులు పూర్తిచేశారు. దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, భక్తుల దర్శనానికి సంబంధించి ప్రత్యేక, ధర్మ దర్శన క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ పేర్కొంది.
అన్ని ఏర్పాట్లు చేసినం
భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాం. కరోనా నిబంధనలు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాం. భక్తులకు తాగునీటి సమస్య, మల్లన్న కళ్యాణం, బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం.
:: బాలాజీ, ఆలయ ఈవో
నిరంతర పర్యవేక్షణ
జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయం నలుమూలల 64 సీసీ కెమెరాలను ఏర్పాటుచేసినం. శాంతిభద్రతలను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. వీఐపీలు, భక్తుల పలు వాహనాలను పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే నిలపాలి. జాతరలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
:: మహేందర్, హుస్నాబాద్ ఏసీపీ