- నాగర్ కర్నూల్ లో రాజ్యాంగం అమలవుతుందా?
- మేము పిలుపు ఇస్తే మీరు గ్రామాల్లో తిరగలేరు
- మాజీఎంపీ మల్లు రవి ఆగ్రహం
- శాయిన్ పల్లిలో బీఆర్ఎస్ దౌర్జన్యకాండపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: బిజినేపల్లి మండలం శాయిన్ పల్లి గ్రామ శివారులో ఉన్న మార్కండేయ రిజర్వాయర్ పనుల పరిశీలనకు వెళ్తున్న మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తే సహించేది లేదని మాజీఎంపీ మల్లు రవి తీవ్రంగా హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యంగా గిరిజన కాంగ్రెస్ కార్యకర్త వాల్యానాయక్, బిజినేపల్లి డిప్యూటీ సర్పంచ్, దళిత నాయకుడు మిద్దె రాములును ముగ్గురు అగ్రకులాలకు చెందినవారు, వందలాది మంది కార్యకర్తలు చూస్తుండగానే కిందపడేసి ఇద్దరిని గొంతుపై కాలుపెట్టి చంపేందుకు ప్రయత్నించారని అన్నారు. ఈ దృశ్యాలను పలు పత్రికల్లో ఫొటోలతో సహా ఆధారాలు చూపించిన కూడా కేవలం పోలీసులు అట్రాసిటీ, హత్యాయత్నం కేసు చేయడం లేదన్నారు. జిల్లా పోలీస్ అధికారులు పలు పత్రికల్లో వచ్చిన ఫొటోలనైనా చూసి బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం డీసీసీ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి.వంశీకృష్ణ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ మహేంద్రనాథ్ అడ్డ అని చెప్పుకునే దళిత, గిరిజన నాయకులు శాయిన్ పల్లి గ్రామంలో ఓ దళిత గిరిజన యువకులను కిందవేసి గొంతుపై కాలుపెట్టి తొక్కుతున్న దృశ్యాలు పేపర్, మీడియాలో వచ్చినా కనీసం ఖండించకపోవడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. పార్టీలు ఏవైనా ఉత్తరప్రదేశ్ లో మాదిరిగా నాగర్ కర్నూల్ జిల్లాలో దళిత గిరిజనులపై దాడులు దౌర్జన్యంగా చేస్తున్నా ఏ ఒక్కరు స్పందించడం లేదన్నారు. అసలు నాగర్ కర్నూల్ లో భారత రాజ్యాంగం అమలు అవుతుందా? అని అనుమానం వ్యక్తంచేశారు. పోలీసులు వెంటనే హత్యాయత్నం కేసు నమోదుచేసి వెంటనే అరెస్టు చేయని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అసలు తాము పిలుపు ఇస్తే కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డితో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ కు ఫిర్యాదుచేశారు. వారి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.