- ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
- జిల్లా వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్
సామాజిక సారథి, హైదరాబాద్: కరోనా మూడో వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొందామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన
అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్, ఒమిక్రాన్ వేరియంట్‌ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వైద్యసేవలను దేశానికి ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. రెండో డోసు వంద శాతం పూర్తయ్యేలా పనిచేయాలని ,15–18 ఏళ్ల వారి వ్యాక్సినేషన్ వేగం పెంచాలని అధికారులకు సూచించారు. అన్ని సబ్ సెంటర్లు, పీహెచ్‌సీ కేంద్రాల్లో ఐసొలేషన్ కిట్లు, పరీక్ష కిట్లనను సిద్ధం చేయాలన్నారు. లక్షణాలు ఉంటే పరీక్ష చేసి, వెంటనే కిట్లు అందించాలని చెప్పారు. అయితే కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువ, ప్రమాదం తక్కువగా ఉందని భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. నాన్ కోవిడ్ సేవలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంతరాయం కలగకుండా వైద్యాధికారులు ఎప్పటికప్పుడు సన్నద్ధం కావాలని మంత్రి ఆదేశించారు.