Breaking News

స్త్రీశక్తి సన్నద్ధం కావాలి

స్త్రీశక్తి సన్నద్ధం కావాలి

హైదరాబాద్‌: ట్రాఫిక్‌, సైబర్‌ క్రైం సహా అన్ని విభాగాల్లో సైబరాబాద్‌లో 12 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని సైబరాబాద్‌‌ సీపీ సజ్జనార్‌ వివరించారు. పిల్లలు, మహిళల భద్రతపై ప్రత్యేకశ్రద్ధ వహించామని చెప్పారు. ఈ ఏడాది సైబరాబాద్‌కు 750 మంది మహిళా కానిస్టేబుళ్లు పోస్టింగ్‌పై వచ్చారని వెల్లడించారు. షీ టీమ్​తో సమాజంలో మార్పు వస్తుందన్నారు. సమాజం, దేశం కోసం స్త్రీ శక్తి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. బుధవారం ఫిల్మ్ నగర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో ‘షి పాహి’ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ సినీనటి అనుష్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళా భద్రతా అదనపు డీజీ స్వాతిలక్రా, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, షీ టీమ్స్‌ డీసీపీ అనసూయతో కలిసి సైబరాబాద్‌ డయల్‌ 100 క్విక్‌ రెస్పాన్స్‌ వాహనాలను అనుష్క ప్రారంభించారు. అనంతరం సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విశిష్ట సేవలందించిన పోలీసులకు అవార్డులు అందించారు. అనంతరం డీజీ స్వాతిలక్రా మాట్లాడుతూ.. 2014లో షీ టీమ్స్‌ మొదలు పెట్టామని, షీ టీమ్‌ విభాగంలో పురుషులు కూడా ఉన్నారని చెప్పారు. మహిళల భద్రత కోసం తెలంగాణ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. మహిళల కోసం రాష్ట్రంలో నాలుగు భరోసా సెంటర్లు ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది భరోసా కేంద్రాలను 10కి పెంచుతామన్నారు. సైబరాబాద్‌ పరిధిలో ఒకేసారి 2058 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని వివరించారు.

షి పాహిని ఆవిష్కరిస్తున్న సీపీ సజ్జనార్​, సినీనటి అనుష్క

ప్రతి మహిళా ఒక పోలీస్‌ కావాలి
ప్రతి మహిళా ఒక పోలీస్‌ కావాలని సినీనటి అనుష్క అన్నారు. కరోనా సమయంలో పోలీసులు చాలా బాగా పనిచేశారని గుర్తుచేశారు. తెలంగాణలో ఇంతమంది మహిళా పోలీసులు ఉండటం సంతోషకరమని చెప్పారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 

క్విక్‌ రెస్పాన్స్‌ వాహనాన్ని ప్రారంభిస్తున్న అనుష్క
క్విక్‌ రెస్పాన్స్‌ వాహనాన్ని ఆవిష్కరిస్తున్న సీపీ సజ్జనార్​, సినీనటి అనుష్క
బెలూన్లను ఎగరవేస్తున్న సీపీ సజ్జనార్​, అనుష్క, ఇతర పోలీసు అధికారిణులు