Breaking News

కోడేర్ లో కొవిడ్ ద‌వాఖాన‌ ప్రారంభం

ర్ లో కొవిడ్ ద‌వాఖాన‌ ప్రారంభం

సారథి, కొల్లాపూర్(కోడేరు): క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న త‌రుణంలో గ్రామీణ ప్రాంతవాసులకు వైద్యసేవలు అందించేందుకు అమెరిక‌న్ తెలంగాణ సొసైటీ(ఏటీఎస్‌), తెలంగాణ ఇన్ ఫర్మేషన్ టెక్నాల‌జీ అసోసియేష‌న్(టీటా) వేగంగా ముందుకు తీసుకుపోతున్నాయి. క‌రోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు నారాయ‌ణపేట జిల్లా మాగ‌నూర్ లో తొలి ద‌వాఖానను గతనెల ప్రారంభించారు. కొనసాగింపుగా శనివారం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కోడేర్ లో కొవిడ్ హాస్పిటల్ ను ఎస్పీ పి.సాయిశేఖర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా టీ.క‌న్సల్ట్ ద్వారా మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి తొలి అపాయింట్‌మెంట్ ను బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అమెరికాలో ఉన్న డాక్టర్లతో అనుసంధానమయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఎస్పీ సాయిశేఖర్ మాట్లాడుతూ.. హెల్త్ కేర్ లో టెక్నాల‌జీ ఎలా వినియోగించవచ్చు అన్నది టీటా నిరూపిస్తుంద‌ని ప్రశంసించారు. ఉన్నత విద్యావంతులైన టెక్కీలు టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌క్తాల ఆధ్వర్యంలో ప‌ల్లెసీమ‌ల్లో సేవలు చేసేందుకు ముందుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌ని కొనియాడారు. సందీప్ మ‌క్తాల‌తో సుమారు ప‌దేళ్లుగా ఉన్న ప‌రిచ‌యంతో ఆయ‌న సామాజిక స్పృహ‌, గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాల‌నే తపన స్పష్టంగా గమనించామన్నారు. ‘స్టాప్ థర్డ్ వేవ్’ అనే ప్రచారంతో ప్రజలను చైతన్యం చేయనున్నట్లు వెల్లడించారు. బ‌ల్మూర్‌లో కొవిడ్ ద‌వాఖాన ఏర్పాటు దాత మాధ‌వ‌రం రంగారావు మాట్లాడుతూ గ్రామస్తుల‌కు ఈ ఆరోగ్య కేంద్రంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.
కొవిడ్ దవాఖాన పనితీరు ఇలా..
సంప్రదాయ వైద్యం ప‌నితీరు రూపంలోనే ఇక్కడి కొవిడ్ దవాఖానలో వసతులన్నీ ఉంటాయి. పీపీఈ కిట్లతో వలంటీర్లు సిద్ధంగా ఉంటారు. స్థానిక ల్యాబ్ లతో ఒప్పందం కుదుర్చుకుని ఉచిత పరీక్షలు నిర్వహిస్తారు. ఓపీ ద్వారా రోగి వీడియో కన్సల్టింగ్ రూపంలో డాక్టర్లతో అనుసంధానమవుతారు. పీహెచ్‌సీలో కొవిడ్ నిర్ధారణ అయిన వారికి ఇక్కడ వైద్యసహాయం వీడియో కన్సల్టింగ్ రూపంలో సాగుతుంది. ఇక్కడ సీబీపీ(కంప్లీట్ బ్లడ్ పిక్చర్), సీఎంఏపీ పరీక్షలను ఉచితంగా చేయనున్నారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మ‌రో బీహెచ్ఎంఎస్ డాక్టర్ సేవ‌లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. జిల్లా ప్రధాన ఆస్పత్రికి 30 కి.మీ.దూరంలో ఈ పీహెచ్‌సీ ఉంది. ఈ నేప‌థ్యంలో క్షేత్రస్థాయిలో టీటా అధ్యక్షుడు సందీప్ మ‌క్తాల సార‌థ్యంలోని బృందం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కోడేర్ మండ‌లంలో పర్యటించి వివిధ గ్రామాలను అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడ కొవిడ్ దవాఖాన కోసం ఎంపికచేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటస్వామి, సీఐ వెంకట్ రెడ్డి, ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు జగదీశ్వర్ రావు, ఎంపీటీసీ నర్సింహ్మ, మైనారిటీ కోఆప్షన్ సభ్యుడు బాబు, స్కూలు చైర్మన్ శేఖర్, శ్రీశైలం, టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌క్తాల‌, శ్రావ‌ణి బాస‌రాజు, ఇలియాస్ , సౌమ్య, పూజా బండారి పాల్గొన్నారు.