– మెగా రెడ్డి వైపు లీడర్లు.
– వనపర్తి కాంగ్రెస్ లో ఆదిపత్య పోరు.
సామాజిక సారథి , వనపర్తి: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు వీస్తున వేళ వనపర్తి లో మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జిల్లల చిన్నారెడ్డికి ఇటీవల పార్టీ లోకి వచ్చిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది . వనపర్తి కాంగ్రెస్ టికెట్ కోసం వీరిద్దరూ దరఖాస్తు చేసుకోగా చివరికి కాంగ్రెస్ అధిష్టానం మాజీ మంత్రి చిన్నారెడ్డి వైపే మొగ్గు చూపింది . దీంతో గత కొద్ది రోజులుగా టికెట్ కోసం ప్రయత్నించిన మెగా రెడ్డి షాక్ కు గురయ్యారు . దీంతో తాను రెబల్ గా పోటీచేస్తానని ప్రకటన చేశారు . అంతటితో ఆగకుండా కాంగ్రెస్ అధిష్టానం పై తనకు బీ ఫాం ఇవ్వాలని వత్తిడి పెంచారు . చివరి నిమిషంలో తనకే బీఫామ్ వస్తుందంటూ ఆయన ప్రచారం మొదలు పెట్టాటంతో పార్టీలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి . గత నలభై సంవత్సరాలుగా మాజీ మంత్రి చిన్నారెడ్డి వనపర్తి రాజకీయాలను శాసిస్తూ వస్తున్నారు . ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన మాటే శాసనంగా నడిచింది . యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నేతగా, రాజీవ్ గాంధీ కుటుంబానికి సన్నితుడిగా ఆయనకు ఉన్న గుర్తింపు ఆ పార్టీలో ఎంతోమంది కొత్త వారికి పార్టీ టికెట్లు ఇచ్చేలా చేసింది . చిన్నారెడ్డి చెప్పిన వారిని కాదనకుండా రాజీవ్ గాంధీ గతంలో 40 మందికి పైగా టికెట్లు ఇచ్చారని చెబుతారు. దీంతో చిన్నారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు . తెలంగాణ ఉద్యమ సమయంలో చిన్నారెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 42 మందితో వనపర్తి లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు . తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటూ తీర్మానం చేసి కాంగ్రెస్ అధిష్టానానికి సమర్పించారు .
ఈ అంశము అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది . దీంతో చిన్నారెడ్డి ని రాజశేఖర్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకోలేదు . తెలంగాణ పై ప్రజల్లో ఆకాంక్ష గ్రహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను చేపట్టారు . అదేవిదంగా ఉద్యమ కారుల డిమాండ్ లను ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తుండటంతో చిన్నారెడ్డికి రాజశేఖరరెడ్డి కి మధ్య దూరం తగ్గి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గా చిన్నారెడ్డి అవకాశం కల్పించారు . ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి చిన్నారెడ్డి పరాజయం పాలయ్యారు . అదే సమయంలో అధికారంలోకి తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుని తిరిగి రెండో సారి ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి భాధ్యతలు స్వీకరించారు . కొద్ది రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు .
ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కే రోశయ్య తెలంగాణ ఉద్యమ తాకిడికి తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో లేనని కాంగ్రెస్ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు . ఈ సమయంలో తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన చిన్నారెడ్డి అయితే సరిపోతుందంటూ సోనియాగాంధీ ఆయన పేరును ప్రస్తావించింది . ఆ సమయంలో చిన్నారెడ్డి ఓటమిపాలు కావడంతో గత్యంతరం లేని పరిస్థితిలో రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా అవకాశం కల్పించారు . అయితే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పటై తెలంగాణకు జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి చిన్నారెడ్డి వనపర్తిలో విజయం సాధించారు . తెలంగాణ సెంటిమెంటు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ వనపర్తి లో మాత్రం చిన్నారెడ్డి హవా నడిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరో సారి టిక్కెట్ సాధించిన మాజీ మంత్రి చిన్నారెడ్డి కి స్వంత పార్టీ లో తలనొప్పులు ఎదురవుతున్నాయి . బీఆర్ఎస్ కు చెందిన పెద్దమందడి ఎంపీపీ మేగారెడ్డి చిన్నారెడ్డికి కాలిలో ముల్లుల తయారయ్యారు . వనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి తనకు టికెట్ ఇవ్వాలంటూ మెగా రెడ్డి అధిష్టానం వద్ద ఒత్తిడి పెంచటమే కాకుండా చిన్నారెడ్డి పై విమర్శలు చేస్తుండటం క్యాడర్ లో అయేమయం నెలకొంది . మొదట ఎవరికి టికెట్ వచ్చిన అంత కలిసి పని చేయాలంటూ పరస్పరం అంగీకారానికి వచ్చారు . ఆ తరువాత చిన్నారెడ్డి తో మెగా రెడ్డి విభేదించారు , కలిసి పని చేసేందుకు ససేమిరా అంటున్నారు . మెగా రెడ్డి స్వంతం గా సభలు, సమావేశాలు , చేరికలు నిర్వహిస్తూ కాంగ్రెస్ క్యాడర్ ను తన వైపు మళ్ళించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు . దీనిని చిన్నారెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారు . ఒక దశలో తిరిగి తనకే కాంగ్రెస్ టికెట్ వస్తుందంటూ మేఘారెడ్డి ప్రచారం చేసుకోవడం పట్ల చిన్నారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . కాంగ్రెస్ పార్టీ నేతల ఫోటోలతో హస్తం గుర్తుతో మేఘారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటం పై రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది . చిన్నారెడ్డి పై మెగా రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది . ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు . చిన్న వయసు వాడైన మేఘారెడ్డిని వెనక్కి తగ్గాలంటూ పలువురు సూచిస్తున్నారు . ఈ నేపథ్యంలో మేఘారెడ్డి తాను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అవసరమైతే కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేస్తారని అంటున్నారు . ఒకవేళ తాను గెలిస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెబుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం ఈ పంచాయతీలో వేలు పెట్టడం లేదు . దీంతో ఒక వైపు చిన్నారెడ్డి మరో వైపు మెగా రెడ్డి బలప్రదర్శన లకు దిగుతున్నారు . మాజీ మంత్రి చిన్నారెడ్డి ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సభకు భారీగా జనం తరలివచ్చారు . క్రింది స్థాయి కేడర్ మొత్తం చిన్నారెడ్డికి బాసటగా నిలవడంతో పార్టీలో చర్చ మొదలైంది . బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన లీడర్లు మినహా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తన వెంట ఉన్నారని చిన్నారెడ్డి అంటున్నారు . వీరిద్దరి పంచాయతీ టిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి నిరంజన్ రెడ్డికి అనుకూలంగా మారుతోంది . బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ ఎవరి ఖాతాలో పడుతుందోనని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు . మేగా రెడ్డి రెబల్ గా పోటీచేస్తే కాంగ్రెస్ ఓట్లు చీలుతాయా? లేక మంత్రి పై ఉన్న అసమ్మతి ఓటు మాత్రమే మెగా రెడ్డి ఖాతాలో పడతాయా అంటూ చర్చా సాగుతోంది . ఇద్దరి పంచాయతీ మూడో వ్యక్తికి మేలు చేస్తుందా అని అనుమానిస్తున్నారు. వనపర్తి ఓటరు ఎవరి వైపు మొక్కుతారో ..ఎవరిని గెలిపిస్తారో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.