Breaking News

వచ్చి రాని వైద్యంతో ప్రాణాల మీదికి తెచ్చిండు..!

#నాగర్ కర్నూల్ జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం
#కిడ్నీ సమస్యతో వెళితే ఆరునెలల కోర్సు వాడాలంటూ వైద్యం
#మూడు వారాలకే వైద్యం వికటించి మంచం పట్టిన రోగి
#రోజురోజుకు బరువు తగ్గడంతో పాటు శరీరం నిండా మచ్చలు
#ప్రాణాపాయ స్థితిలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
#న్యూ లైఫ్ క్లినిక్ వైద్యుడి పై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ ఓ కు ఫిర్యాదు.

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఆర్ఎంపీ వైద్యులు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, డబ్బుకు ఆశపడి స్థాయి కి మించిన వైద్యం చేయవద్దని పదే పదే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా కొందరు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు పట్టడం లేదు. కాసుల కోసం కక్కుర్తి పడి అమాయక ప్రజల ప్రాణాలతో కొందరు ఆర్ఎంపీ డాక్టర్లు చెలగాటం ఆడుతున్నారు. ఇదే కోవలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో న్యూ లైఫ్ ఆసుపత్రి నిర్వహిస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ షమీ ఓ 19 ఏళ్ల యువకుడి ప్రాణాలతో చెలగాటం ఆడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భాదిత కుటుంభ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన వట్టెపు అరవింద్ (19) కిడ్నీ సంభందిత సమస్యతో తేది. 15.02.2024 న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని న్యూ లైప్ క్లినిక్ వచ్చారు. ఇక్కడి ఆర్ఎంపీ డాక్టర్ కిడ్నీ సమస్య కు వైద్యం చేయడం తన పరిధిలోనిది కాదన్న సంగతిని పక్కన బెట్టి డబ్బు ఆశతో పేషెంట్ అరవింద్ కు వివిధ రకాల టెస్ట్ లు చేయించాడు. ఈ సమస్య కు తప్పని సరిగా ఆరు నెలలు మెడిసిన్స్ వాడాలని, ప్రతి వారం చెకఫ్ అవసరం అని మందులు ఇచ్చారు. పేషెంట్ అరవింద్ ఆర్ఎంపీ డాక్టర్ షమీ సూచించిన విధంగా మందులను వాడడం ప్రారంభించాడు. కాని కేవలం మూడు వారాలలోపే తన కిడ్నీ సమస్య తగ్గకపోగా రోజు రోజుకు బరువు తగ్గుతుండడంతో పాటు శరీరం పై పొక్కులు పొక్కులు గా ఏర్పడి ఆరోగ్యం మరింత విషమంగా మారుతూ వచ్చింది. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని నిరుపేద యువకుడు అరవింద్ కు ఆర్ఎంపీ డాక్టర్ చేసిన వైద్యం వికటించి క్రమక్రమంగా మంచానికే పరిమితమయ్యాడు. అరవింద్ రోజు రోజుకు బరువు తగ్గడంతో పాటు శరీరం మొత్తం దద్దుర్లు ఏర్పడి పరిస్థితి మరింత విషమించడంతో కుటుంభ సభ్యులు ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తన స్థాయికి మించిన వైద్యం చేసి ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువకుడి జీవితంతో చెలగాటం ఆడడం పై కుటుంభ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆర్ఎంపీ డాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ఎంపీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి…

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో న్యూ లైప్ ఆసుపత్రి పేరుతో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆర్ఎంపీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని సోమవారం బీఎస్పీ నాయకులు డిప్యూటీ డీఎంహెచ్ వో కు ఫిర్యాదు చేశారు. క్లినిక్ నిర్వహించేందుకు ఎలాంటి అర్హతలు లేకున్నా, కేవలం ఆర్ఎంపీ హోదాతో క్లినిక్ నిర్వహించడం ఏంటని వారు ప్రశ్నించారు. ఈ క్లినిక్ లో ప్రతి 3 నెలలకు, 6 నెలలకు ఏదో ఒక పేషంట్ కు సరైన ట్రీట్మెంట్ అందక చావు అంచుల దాకా వెళ్తున్న సంఘటనలు నిరంతరం పునరావృత్తం అవుతున్నా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. గతంలో ఓ పేపెంట్ ఇలాగే వైద్యం వికటించి మృతి చెందడంతో ఈ క్లీనిక్ ను సీజ్ చేసినా అప్పటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల అండతో మళ్లీ కొనసాగిస్తున్నాడని బీఎస్పీ నాయకులు తెలిపారు. జిల్లా లో ఇలా ఆర్ఎంపీ డాక్టర్లు అరకకొర వైద్యంతో ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయం అధికారులు నిరుపేద యువకుడి ప్రాణాల మీదికి తీసుకువచ్చి ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చిన న్యూ లైఫ్ ఆసుపత్రి అనుమతులు రద్దు చేసి ఆర్ఎంపీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా అధికారుల ఉదాసీనత వల్లే జిల్లాలో అనేక చోట్ల ప్రజల ప్రాణాలకు ఆర్ఎంపీ డాక్టర్లు ధర కట్టి విషయం బయటికి పొక్కకుండా చేస్తున్నారని అన్నారు. ఇప్పటి కైనా ఈ క్లీనిక్ , ఆర్ఎంపీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్, ఈసీ మెంబర్ రాము, బిజీనపల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంచందర్, శివకృష్ణ, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.