Breaking News

లంక క్రికెటర్ల ట్రైనింగ్​ షురూ

కొలంబో: అంతర్జాతీయ క్రికెట్​ను మళ్లీ మొదలుపెట్టేందుకు శ్రీలంక బోర్డు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే 13 మంది క్రికెటర్లతో ఔట్‌డోర్‌ ట్రైనింగ్​ మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. కొలంబో క్రికెట్‌ క్లబ్‌లో జరిగే ఈ ‘రెసిడెన్షియల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌’ కోసం ఎక్కువ మంది బౌలర్లను ఎంపికచేశారు. ‘మూడు ఫార్మాట్లకు సంబంధించిన క్రికెటర్లు ఇందులో ఉన్నారు. టోర్నీల్లో పాల్గొనడానికి బౌలర్లకు ఎక్కువ ప్రాక్టీస్‌ అవసరం. ప్రతి గ్రూపులో నలుగురు క్రికెటర్లు ఉంటారు. వీళ్ల ప్రాక్టీస్‌ను కోచ్‌, సహాయక సిబ్బంది పర్యవేక్షిస్తుంది. మా ప్రభుత్వం నిర్దేశించిన హెల్త్‌ ప్రొటోకాల్​ను అందరూ పాటించాల్సిందే. క్రీడా, ఆరోగ్య శాఖలను సంప్రదించిన తర్వాత ఈ క్యాంప్‌ను ఏర్పాటుచేశాం. ప్లేయర్లకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ క్యాంప్‌లో పాల్గొనే క్రికెటర్లు హోటల్‌ రూమ్స్‌, శిక్షణ ప్రదేశాలను వదిలి బయటకు వెళ్లే చాన్స్‌ లేదు. వ్యక్తిగత అంశాలను కూడా అనుమతించం’ అని ఎస్‌ఎల్‌సీ పేర్కొంది.