Breaking News

మంజీరా వరదలో చిక్కినవారు సేఫ్

మంజీరా వరదలో చిక్కినవారు సేఫ్

సారథి న్యూస్, మెదక్: మంజీరా నది వరదలో చిక్కుకుపోయిన ఐదుగురు వ్యక్తులను గురువారం హెలికాప్టర్​సహాయంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ సమీపంలోని మంజీరా నది పాయల మధ్యలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో సూపర్​వైజర్​గా పనిచేసే కొమురయ్య, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే నాగరాజు, దుర్గాప్రసాద్, వాచ్​మెన్​గా పనిచేసే శ్రీధర్లు రోజు మాదిరిగా విధి నిర్వహణలో భాగంగా మంగళవారం నదిపాయ ఒడ్డున ఉన్న బాయర్​ సీడ్​ కంపెనీ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లారు. వారితోపాటు కిష్టాపూర్​కు చెందిన మహేష్​ గేదెలు తప్పిపోగా వాటిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్లాడు. వారు మంగళవారం సాయత్రం తిరిగి వచ్చే సమయానికి వర్షం మొదలైంది. దీంతో అక్కడే ఆగిపోయారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలోని సింగూర్​ ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో నది ఒడ్డున ఉన్న ఐదుగురు అక్కడే చిక్కుకునిపోయారు.

నది వరదలో చిక్కుకున్న వారిని గాలిస్తున్న హెలిక్యాప్టర్​

ప్రాణాలకు ఆపాయం లేకున్నా తినడానికి అక్కడ ఏమి అందుబాటులో లేకపోవడంతో వారు గురువారం 100 నంబర్​ కాల్​చేసి తమ పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో నర్సాపూర్​ ఇన్​చార్జ్​ ఆర్డీవో సాయిరాం, మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి గురువారం సంఘటన స్థలానికి చేరుకుని నది ఒడ్డున చిక్కుకున్న వారితో మాట్లాడారు. అనంతరం జిల్లా ఇన్​చార్జ్​ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, జిల్లా ఇన్​చార్జ్​ఎస్పీ జోయస్​డానియల్​కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి హైదరాబాద్ హకీంపేటలోని ఇండియన్​ఏయిర్​ఫోర్స్​ హెలికాప్టర్​ను తెప్పించారు. హెలికాప్టర్​సహాయంతో నది పాయ ఒడ్డున చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులను సురక్షతంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో గురువారం పొద్దుటి నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అంతా ఊపిరిపీల్చుకున్నారు.

హెలిక్యాప్టర్​లో వస్తున్న బాధితులు