Breaking News

ఫ్యామిలీస్​పై బెంగతోనే అలా..

కింగ్‌స్టన్‌: కరోనా కారణంగా ఆగిపోయిన ఇంటర్​నేషనల్‌ క్రికెట్‌ వచ్చేనెల ఇంగ్లండ్‌–వెస్టిండీస్‌ మధ్య టెస్టు సిరీస్‌తో తిరిగి మొదలవనుంది. ఇంగ్లండ్‌ వేదికగా పూర్తి బయో సెక్యూర్‌ వాతావరణంలో జరిగే ఈ సిరీస్‌ గురించి క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇంగ్లిష్‌ టీమ్‌ ఇప్పటికే ఔట్‌ డోర్‌ ట్రైనింగ్​ స్టార్ట్‌ చేయగా.. విండీస్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. అయితే, ముగ్గురు స్టార్‌ ప్లేయర్లు డారెన్‌ బ్రావో, షిమ్రన్‌ హెట్‌మయర్‌, కీమో పాల్‌ ఇంగ్లండ్‌ వెళ్లేందుకు నిరాకరించడం చర్చనీయాశమైంది. ఈ ముగ్గురు లేకుండానే టీమ్‌ను ఎంపికచేసిన క్రికెట్‌ వెస్టిండీస్‌ (సీబ్ల్యూఐ).. తమ కుటుంబాల శ్రేయస్సు కోసమే వాళ్లు ఇంగ్లండ్‌ టూర్‌కు రాబోమని చెప్పారని ప్రకటించింది.

‘కీమో పాల్‌ కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడుతుంది. పైగా వాళ్లది విస్తృత కుటుంబం. దాంతో, తనకేమైనా అయితే ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? అని పాల్‌ ఆందోళన చెందాడు. ఇదే విషయాన్ని అతను బోర్డుకు ఈ మెయిల్‌ ద్వారా తెలియజేశాడు. వెస్టిండీస్‌కు ప్రాతినిథ్యం వహించడాన్ని ఎంతగానో ఇష్టపడే తాను ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించాడు. ఫ్యామిలీతో చర్చించిన తర్వాత వాళ్లను విడిచిపెట్టి ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు’ అని సీడబ్ల్యూఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జానీ గ్రేవ్‌ చెప్పారు. అలాగే, ఇంటిని, కటుంబసభ్యులను వదిలి ఇంగ్లండ్‌కు వెళ్లడం భద్రతాపరంగా తనకు సౌకర్యవంతంగా అనిపించడం లేదని హెట్‌మయర్‌ తెలిపాడని ఆయన అన్నారు.

డారెన్‌ బ్రావో కూడా ఇంగ్లండ్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ టైమ్‌లో తన కుటుంబాన్ని వదలి ఉండకూడదని నిర్ణయించుకున్నాడని గ్రేవ్‌ తెలిపారు. ఈ ముగ్గురు చెప్పిన కారణాలు సహేతుకమైనవే అని, వాటిని తాము గౌరవించామని అన్నారు. తాము ఎవరినీ ఫోర్స్‌ చేయదలచుకోలేదు కాబట్టి.. తమ నిర్ణయాలపై పునరాలోచించుకోవాలని వారిని కోరలేదని చెప్పారు.