Breaking News

ఫార్మాట్‌ బట్టి కోచ్‌

  • ఆసీస్‌ మాజీ కోచ్‌ డారెన్‌ లీమన్‌

లండన్‌: అసలే బిజీ షెడ్యూల్‌.. ఆపై ఎక్కువగా ప్రయాణాలు.. మూడు ఫార్మాట్లకు ఒకే కోచ్‌ ఉంటే.. ఏడాదిలో ముప్పావు భాగం బయటే గడపాల్సిన పరిస్థితి.. ఈ నేపథ్యంలో కోచింగ్‌ వ్యవస్థను విడదీయాలని ఆసీస్‌ మాజీ కోచ్‌ డారెన్‌ లీమన్‌ అన్నాడు. అందుకు ఇదే సరైన సమయమని, భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌ మరింత ముందుకెళ్లాలంటే ఇలా చేయాలని సూచించాడు. ఆయా ఫార్మాట్లను బట్టి ప్రత్యేక కోచ్‌లను నియమిస్తే ఒత్తిడి, బరువు తగ్గుతుందన్నాడు. ‘స్ల్పిట్‌ కోచింగ్‌ వల్ల ప్రపంచ క్రికెట్‌కు మంచే జరుగుతుంది. ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు.

సింగిల్‌ కోచ్‌గా ఉంటే దాదాపు 200 రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. దీనివల్ల కుటుంబంతో పాటు వ్యక్తిగతంగానూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తున్నది. కాబట్టి బాధ్యతలను పంచడం వల్ల కోచ్‌ల పనితనం మెరుగవుతుంది. సుదీర్ఘకాలం పనిచేసే సత్తా కూడా పెరుగుతుంది’ అని లీమన్‌ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ విజేత టీమ్‌ కోచ్‌ ట్రెవర్‌ బెయిలిస్‌తో జరిగిన ఓ కార్యక్రమంలో లీమన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడున్న చాలా మంది ప్లేయర్లు మంచి కోచ్‌లుగా రాణిస్తారని లీమన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

సన్‌రైజర్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌ బ్రాడ్‌ హాడిన్‌కు ఓటేస్తే.. ఫ్యూచర్‌లో ఇయాన్‌ మోర్గాన్‌ మంచి కోచ్‌ అవుతాడని బెయిలిస్‌ ప్రకటించాడు. ‘మోర్గాన్‌ చాలా లోతుగా ఆలోచిస్తాడు. మిగతా క్రికెటర్లు కూడా అతన్ని చాలా గౌరవిస్తారు. ఓ కోచ్‌కు కావాల్సింది కూడా ఇదే. ఐదేళ్లుగా ఇంగ్లండ్‌ వైట్‌బాల్‌ టీమ్‌ను బాగా నడిపిస్తున్నాడు. ఒకవేళ అతను కోచ్‌గా మారాలనుకుంటే నేను మద్దతిస్తా’ అని బెయిలిస్‌ వ్యాఖ్యానించాడు. మరోసారి అంతర్జాతీయ జట్లకు కోచ్‌గా పని చేసే అవకాశం లేదన్నాడు. కుటుంబానికి దూరంగా ఉండటం తనకు ఇష్టంలేదన్నాడు.