Breaking News

నేనే లాస్ట్ అన్నారు: బుమ్రా

నేనే లాస్ట్ అన్నారు: బుమ్రా

న్యూఢిల్లీ: తన అసాధారణ బౌలింగ్‌ యాక్షన్‌ కారణంగా ఎక్కువ రోజులు క్రికెట్‌ ఆడలేనని చాలా మంది భయపెట్టారని టీమిండియా పేసర్‌ బుమ్రా అన్నాడు. ఇలాంటి భిన్నమైన శైలితో ఆడేవారిలో తానే చివరి వాడినని, మరెవరూ ఇండియాకు ఆడే చాన్స్‌ లేదన్నారని చెప్పాడు. ‘నా బౌలింగ్‌ యాక్షన్‌పై చాలా మందికి సందేహాలు ఉండేవి. అసాధారణ యాక్షన్‌ తో లాంగ్‌ టైమ్‌ టీమిండియాకు ఆడలేదని చాలా మంది హెచ్చరించారు. ఈ శైలిలో శరీరంలో ఇబ్బందులు వస్తాయన్నారు.

గాయాలతో ఎక్కువ రోజులు బౌలింగ్‌ చేసే పరిస్థితి ఉండదని భయపెట్టారు. ఇండియా తరఫున నేనే చివరి వాడనవుతానని కూడా చాలామంది నాతో అన్నారు. అయితే వీటన్నింటిని పట్టించుకోకుండా నా హెల్త్‌, ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ బౌలింగ్‌ యాక్షన్‌ను కొనసాగిస్తున్నా’ అని యువరాజ్‌ సింగ్‌తో జరిగిన ఇన్‌ స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో బుమ్రా పేర్కొన్నాడు. తన బౌలింగ్‌ యాక్షన్‌కు స్ఫూర్తి ఎవరూ లేరని చెప్పిన బుమ్రా.. టీవీల్లో చూసి బౌలింగ్‌ నేర్చుకున్నానని తెలిపాడు. అయితే టెన్నిస్‌ బాల్‌ యాక్షన్‌ను రెప్లికేట్‌ చేశానన్నాడు. ‘ఈ యాక్షన్‌ ఎప్పుడు డెవలప్‌ అయ్యిందో నాకు గుర్తు లేదు.

అండర్‌–19 వరకు డిఫరెంట్‌ యాక్షన్‌ ఉండేది. కానీ ఇప్పుడున్న యాక్షన్‌ డెవలప్‌ అయ్యాకా.. దీనిని మార్చుకోమని ఎవరూ చెప్పలేదు. ఇక అప్పట్నించి దీనినే కొనసాగిస్తున్నా. ఐపీఎల్‌లో ఆడి రావడంతో నా బౌలింగ్‌ నైపుణ్యం.. ఇంటర్ నేషనల్‌ లెవల్‌కు సరిపోదని చాలామంది విమర్శించారు. వాస్తవానికి 2013లో నేను ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. తర్వాతి రెండు సీజన్లలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే చాన్స్‌ రాలేదు. కేవలం డొమెస్టిక్‌ టోర్నీల్లో రాణించడంతోనే ఈ స్థాయికి చేరుకోగలిగా’ అని ఈ ముంబై ఇండియన్స్‌ పేసర్‌ వ్యాఖ్యానించాడు.

ప్రతి టెస్ట్‌ ముఖ్యమే

కెరీర్‌లో ఆడే ప్రతి టెస్ట్‌ మ్యాచ్‌ తనకు చాలా ముఖ్యమైందని బుమ్రా చెప్పాడు. టెస్ట్ల వల్ల ప్లేయర్‌ సత్తా, నైపుణ్యం తెలిసిపోతుందన్నాడు. 2018లో టెస్ట్ల్లోకి అరంగేట్రం చేసిన బుమ్రా.. అప్పటి నుంచి విరాట్‌ బౌలింగ్‌ వ్యూహాల్లో చాలా కీలకంగా మారాడు. ‘నేను టెస్ట్‌ క్రికెట్‌కు చాలా విలువ ఇస్తా. ప్రతి వికెట్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తా. ఇందులో చాలా సంతృప్తి ఉంటుంది. అందుకే నేను ఇండియాలో ఆడకపోయినా ప్రతి టెస్ట్‌ మ్యాచ్‌ను నాకు ఇంపార్టెంటే. ఎందుకంటే తర్వాతి మ్యాచ్‌లో అవకాశం కోసం ఎదురుచూస్తుంటా’ అని బుమ్రా వెల్లడించాడు.