Breaking News

ధోనీ అందుకు ఒప్పుకోలేదు

  • లంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర

న్యూఢిల్లీ: 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను అప్పటి లంక కెప్టెన్‌ కుమార సంగక్కర గుర్తుచేసుకున్నాడు. ముంబైలోని వాంఖడేలో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో రెండుసార్లు టాస్‌ వేయాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పటి టీమిండియా సారథి ధోనీ వల్లే ఇలా జరిగిందన్నాడు. ‘ఫైనల్‌ కోసం అభిమానులు పోటెత్తారు. జనంతో వాంఖడే నిండిపోయింది. శ్రీలంకలో మేం ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడూ చూడలేదు. మా వాళ్లకు చాలా కొత్తగా అనిపించింది. అంతకుముందు ఈడెన్ గార్డెన్స్​లో ఓసారి అలాంటి పరిస్థితిని చూశా. కీపింగ్‌ స్థానం నుంచి కనీసం ఫస్ట్ స్లిప్‌ ఫీల్డర్‌తో కూడా మాట్లాడలేకపోయా.

ఒకటే హోరు ఆ శబ్దంలో మనం ఏం మాట్లాడుతున్నామో పక్క వారికి కూడా వినిపించదు. వాంఖడేలోనూ అదే సీన్ పునరావృతమైంది. ధోనీ టాస్ కోసం కాయిన్ పైకి ఎగరేశాడు. ఆ సమయంలో నేను చెప్పింది మహీకి వినిపించలేదు. దీంతో టెయిల్స్ చెప్పావా? అని నన్ను అడిగాడు.. లేదు హెడ్‌ అని నేను అన్నా. టాస్ గెలిచానని రెఫరీ కూడా ప్రకటించాడు. కానీ ధోనీ ఒప్పుకోలేదు. దీంతో చిన్న గందరగోళం తలెత్తడంతో మరోసారి టాస్ వేద్దామని ధోనీ ప్రతిపాదించాడు. నేను సరేనని హెడ్స్ చెప్పా. ఈసారీ మళ్లీ నేనే టాస్ గెలిచా. ఒకవేళ నేను టాస్ ఓడిపోయి ఉంటే కప్ మేం గెలిచేవాళ్లం’ అని సంగక్కర గుర్తు చేసుకున్నాడు.