Breaking News

టీ20 ప్రపంచకప్ డౌటే!

వచ్చే ఏడాదికి సిద్ధమన్న సీఏ

మెల్​బోర్న్​: ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగడం కష్టమే. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారులు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే మెగా ఈవెంట్​ను వాయిదా వేయడం ఖాయమేనని స్పష్టమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్​ను నిర్వహించలేమని సీఏ సీఈవో కెవిన్ రాబర్ట్స్ సంకేతాలిచ్చాడు. కరోనా, ప్రయాణ నిషేధం వల్ల ఈ ఏడాది టోర్నీ జరగడం కష్టమేనని తేల్చేశాడు. ‘ఒకవేళ ధైర్యంగా ముందుకెళ్లినా.. టోర్నీ నిర్వహణలో చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫలితంగా ఆస్ట్రేలియా మొత్తం హై రిస్క్​లో పడే ప్రమాదం కూడా ఉంది. అయినా షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌, నవంబర్‌లో ప్రపంచకప్ జరుగుతుందని ఇప్పటికీ ఆశతోనే ఉన్నాం. కానీ అలా జరుగుతుందని చెప్పడం మాత్రం చాలా పెద్ద రిస్క్ తో కూడుకున్నది’ అని రాబర్ట్స్‌ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఇదే టోర్నీని వచ్చే ఏడాది నిర్వహించేందుకు తాము సిద్ధమని సీఏ ప్రకటించడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది. 2022కు బదులుగా 2021లోనే టోర్నీకి ఆతిథ్యమిస్తామని ఐసీసీకి బదులు ఇచ్చింది. ఈ ఏడాది సాధ్యంకాకపోతే ఎప్పుడు నిర్వహిస్తారన్న ఐసీసీ ప్రశ్నకు సీఏ పైవిధంగా స్పందించింది. వచ్చే ఏడాది భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉన్నందున 2022 విండోలో ఆసీస్‌కు అవకాశం ఇవ్వాలన్న సూచనలు వచ్చాయి. మరోవైపు ఈ ఏడాది ప్రపంచకప్‌ను నిర్వహించకపోతే దాదాపు 80 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్ల నష్టం వస్తుందని రాబర్ట్స్‌ ఆందోళన వ్యక్తం చేశాడు.