Breaking News

ఖేల్‌రత్నకు వినేశ్.. అర్జునకు సాక్షి

న్యూఢిల్లీ: మూడేళ్లుగా రెజ్లింగ్​లో నిలకడగా రాణిస్తున్న భారత రెజ్లర్ వినేశ్ పోగట్.. వరుసగా రెండో ఏడాది ప్రతిష్టాత్మక రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డుకు నామినేట్ అయ్యింది. ఆమె పేరును సిఫారసు చేస్తున్నామని రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) తెలిపింది. ఈ అవార్డు కోసం గతేడాది కూడా వినేశ్ పోటీపడినా.. బజ్​రంగ్​ పూనియాకు వరించింది. దీంతో ఈసారైనా తనకు అతిపెద్ద క్రీడాపురస్కారం దక్కుతుందని వినేశ్ ఆశాభావం వ్యక్తం చేసింది. జకర్తాలో జరిగిన ఆసియా గేమ్స్​లో స్వర్ణ పతకం నెగ్గిన వినేశ్.. గతేడాది ప్రపంచ చాంపియన్​ షిప్​లో కాంస్యం సాధించింది. అలాగే టోక్యో ఒలింపిక్స్​కు అర్హత కూడా సాధించింది. ఇక 2016లో ఖేల్‌తర్న అందుకున్న సాక్షి మాలిక్‌.. ఈసారి అర్జున అవార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే అర్జున జాబితా పెద్దగా ఉండడంతో సమాఖ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. దీనికితోడు కొంతకాలంగా సాక్షి ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీపక్‌ పునియా, రాహుల్‌ అవ్రే, సందీప్‌ తొమర్‌, రవి దహియా కూడా అర్జున రేస్​లో ఉన్నారు.