Breaking News

కెప్టెన్సీని సచిన్ వద్దన్నాడు

న్యూఢిల్లీ: కెప్టెన్​గా వైఫల్యం.. దాంతో వచ్చిన ఒత్తిడి వల్ల బ్యాటింగ్​లోనూ ఫామ్ కోల్పోవడంతో.. సారథిగా కొనసాగడానికి సచిన్ టెండూల్కర్ ఇష్టపడలేదని అప్పటి చీఫ్ సెలెక్టర్ చందూ బోర్డే వెల్లడించాడు. దీంతో సౌరవ్ గంగూలీని సారథిగా నియమించాల్సి వచ్చిందన్నాడు. ఇందులో ఎలాంటి రహస్యం లేకపోయినా.. అప్పట్లో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయన్నాడు. ‘అప్పట్లో ఆస్ట్రేలియా టూర్​కు సచిన్​ టెండుల్కర్​ ను కెప్టెన్​గా పంపించాం. కానీ అక్కడ సరైన ఫలితాలు రాకపోవడంతో.. ఇండియాకు వచ్చిన వెంటనే సారథిగా కొనసాగలేనని మాకు చెప్పాడు. తాను బ్యాటింగ్​పై మరింత దృష్టి పెట్టాలనుకున్నట్లు మాత్రమే చెప్పాడు. మాకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో స్వయంగా నేనే వెళ్లి ఒప్పించే ప్రయత్నం చేశా. మరికొంత కాలం కొనసాగాలని కోరా. కానీ ఒప్పుకోలేదు. అప్పటికప్పుడు కొత్త కెప్టెన్​గా ఎవర్ని ఎన్నుకోవాలో మాకు అర్థం కాలేదు’ అని బోర్డే వివరించాడు. సారథిగా కొనసాగేందుకు సచిన్ ఎంతకూ ఒప్పుకోకపోవడంతో తమ ముందు ఎక్కువ ప్రత్యామ్నాయాలు లేకపోయాయని బోర్డే వెల్లడించాడు. ‘మేం సచిన్​ను పదేపదే అడగడం మా సభ్యుల్లోనే కొంత మందికి నచ్చలేదు. కొనసాగమని ఎందుకు బలవంతం చేస్తున్నారని నన్ను ప్రశ్నించారు. దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా? అని అడిగారు. వాటికి నా వద్ద సమాధానం లేకపోయినా. .భవిష్యత్ బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నానని చెప్పా. చాలా చర్చల తర్వాత టీమ్​లో కాస్త తెలివిగా, ధైర్యంగా కనిపించే వ్యక్తి ఎవరున్నారా? అని వెతికాం. అప్పటికే గంగూలీలో చొరవ, దూకుడు, ధైర్యాన్ని చూశాం. కానీ ధైర్యంగా స్టెప్ తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చిన టీమ్ భవిష్యత్ దెబ్బతింటుంది. మా ముందు ఎక్కువ ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో దాదాకు కెప్టెన్సీ అప్పగించాం’ అని బోర్డే వివరించాడు.