Breaking News

అన్ని టీమ్ లు వస్తేనే నేషనల్ గేమ్స్

అన్ని టీమ్ లు వస్తేనే నేషనల్ గేమ్స్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ముప్పు నుంచి గట్టెక్కిన గోవా ఇప్పుడు నేషనల్ గేమ్స్ పై దృష్టిపెట్టింది. ఇందుకోసం ప్రిపరేషన్ ను షురూ చేసింది. అయితే పోటీలకు వస్తామని అన్ని రాష్ట్రాల జట్లు హామీ ఇస్తేనే నేషనల్‌ గేమ్స్ జరుగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు.

కరోనా కారణంగా ప్రపంచం పూర్తిగా స్తంభించిన నేపథ్యంలో గేమ్స్‌ నిర్వహణ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఇండియన్ ఒలింపిక్‌ అసోసియేషన్ (ఐఓఏ) నుంచి గోవా గవర్నమెంట్ స్పష్టత కోరింది. ఈ మేరకు ఐవోఏ సెక్రటరీ జనరల్‌ రాజీవ్ మెహతాకు గోవా స్పోర్ట్స్ సెక్రటరీ అశోక్‌ కుమార్ లెటర్ రాశారు. మే 31వ తేదీ వరకు గేమ్స్ కు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు.

ఆ తర్వాతి పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుందని చెప్పారు. ఐవోఏతో చర్చలు జరిపిన తర్వాతే గేమ్స్‌ నిర్వహణపై సరైన నిర్ణయం వెలువడుతుందన్నారు. అందుకు క్వాలిఫై అయిన అన్ని జట్లు గేమ్స్ లో పాల్గొంటామని హామీ ఇవ్వడం ముఖ్యమన్నారు.

36వ నేషనల్ గేమ్స్‌ గోవాలో 2018 నవంబర్‌‌ లోనే జరగాల్సి ఉంది. వాటిని ఈ ఏడాది మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 14 మధ్య నిర్వహించాలని గోవా భావించింది. కానీ, జనరల్‌ ఎలక్షన్స్‌ కారణంగా సాధ్యం కాలేదు. అనేక వాయిదాల తర్వాత ఈ గేమ్స్ ను ఈ ఏడాది అక్టోబర్‌‌ 20 నుంచి నవంబర్ 4వ తేదీల్లో నిర్వహించాలని ఐవోఏ నిర్ణయించింది.