Breaking News

ధనుర్మాసం విశిష్టత తెలుసుకుందాం

ధనుర్మాసం విశిష్టత తెలుసుకుందాం

  • విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం
  • 16 నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభం
  • 25న ముక్కోటి(వైకుంఠ ఏకాదశి) ఏకాదశి

సారథి న్యూస్, పాలెం(బిజినేపల్లి): డిసెంబర్​16 నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభంకానున్నాయి. అయితే ఈ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.. కాలాన్ని కొలిచేందుకు అనేక కొలమానాలను వాడతారు. అందులో చాంద్రమానం, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానంగా లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటే కాలాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ధనస్సురాశిలో ప్రవేశించిన సమయాన్ని ధనుస్సంక్రమణం, ధనస్సులో సూర్యుడు ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనుకూలమైన మాసమని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ఈ మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం, సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు.

విష్ణుమూర్తికి ప్రీతికరం
ధనుర్మాసం పరమ పవిత్రమైంది. సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైంది. కావునా సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలోనే ఆరాధిస్తారు. ఈనెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. గోదాదేవి కథ ఈ మాసానికి సంబంధించినదే. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ‘పండుగ నెలపట్టడం’ అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండగ హడావుడిని గుర్తుచేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. ఈ మాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే స్నానాలు ఆచరించి.. పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామివారిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెలరోజులూ చేయలేని వాళ్లు 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా చేయొచ్చని పండితులు చెబుతుంటారు. పెళ్లికాని యువతులు ఇంటి వాకిళ్లలో ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి పూజలు చేయడం ద్వారా కోరిన వరుడు వస్తాయని ప్రతీతి. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించిందట. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ప్రాచుర్యంలో ఉంది. ధనుర్మాసంలో వ్రతం చేయడం ద్వారా ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారని విశ్వసిస్తారు. కనున ఈ ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు.

నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలో పాలెం వేంకటేశ్వరస్వామి ఆలయం

పాలెంలో ధనుర్మాస పూజలు
నాగర్​కర్నూల్ ​జిల్లా పాలెం వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కె.రామనుజాచార్యులు తెలిపారు. ఈనెల 16 బుధవారం నుంచి వచ్చేనెల(జనవరి) 15వ తేదీ వరకు విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారికి ఆలయ ప్రాంగణంలో ఉన్న చెదుడు బావి నుంచి బిందెసేవ, అభిషేకాలు, ఆరాధనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నైవేద్యంగా పాల భోగం, కట్టె పొంగలి, బెల్లం పొంగలి సమర్పించనున్నట్లు వివరించారు. ఈనెల 25న శుక్రవారం ముక్కోటి ఏకాదశి(వైకుంఠ ఏకాదశి) సందర్భంగా తెల్లవారుజామున ఉత్తరద్వారం నుంచి స్వామివారు, అమ్మవారి పల్లకీ సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.ఆంజనేయులు కోరారు