Breaking News

ధనిక రాష్ట్రంలో బెత్తెడు జీతమా?

ధనికరాష్ట్రంలో బెత్తెడు జీతాలే
  • ప్రశ్నిస్తున్న బాలకేంద్రాల్లోని పార్ట్​ టైం, కాంట్రాక్టు ఉద్యోగులు
  • 20 ఏళ్ల సీనియారిటీ.. రూ.3వేలు, రూ.4వేల జీతాలే
  • పిల్లల ఆటాపాటలు, బహుమతులకు డబ్బులు కరువు

‘తెలంగాణ ఎప్పటికీ ధనిక రాష్ట్రమేనని.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. డబ్బులకు కొదవలేదు..’ 6వ విడత హరితహారం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ ​మాట ఇది..

‘మేం ప్రతి జాతీయ పండగను ఘనంగా జరుపుకుంటాం. పిల్లల చేత నాటికలు, నాటకాలు, ఏక పాత్రాభినయాలూ చేయిస్తాం. మహనీయుల పుట్టిన రోజులు, ప్రముఖుల వర్ధంతుల సందర్భంగా వారిచ్చిన సందేశాలు స్ఫురించేలా.. పాటల పోటీలు, వీధి నాటికలూ వేయిస్తాం. విజేతలకు బహుమతులు కూడా అందజేస్తాం. ఇటీవల హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో కూడా మా బాలకేంద్రం పిల్లలు.. ప్రదర్శనలు ఇచ్చారు. తద్వారా గవర్నర్‌ అభినందనలు కూడా అందుకున్నారు. ఇంత చేసినా ప్రభుత్వం మా వేతనాల పెంపుపై దృష్టి పెట్టడం లేదు..’
– బాలకేంద్రంలో పనిచేస్తున్న ఓ సూపరింటెండెంట్‌ ఆవేదన ఇది

తెలంగాణ రాష్ట్రంలోని బాలకేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్​టైం ఉద్యోగులు, సిబ్బంది తక్కువ వేతనాలతో నెట్టుకొస్తున్నారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లోగల బాలభవన్‌కు అనుసంధానంగా రాష్ట్రంలో మొత్తం 14 బాలకేంద్రాలు, మరో ఏడు మినీ బాల భవన్​లు నడుస్తున్నాయి. అయితే వాటిలో పనిచేసే అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు పెంచకపోవడంతో వారి జీవితాలు అధ్వానంగా మారాయి. పిల్లల మానసిక వికాసానికి, విజ్ఞానానికి ఎంతగానో ఉపయోగపడుతున్న బాలకేంద్రాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఉన్నత విద్యనభ్యసించిన వారితోపాటు లలితకళల్లో డిప్లొమా, పీజీ డిప్లొమాలు పూర్తిచేసి ఆయా కేంద్రాల్లో పనిచేస్తున్న శిక్షకులు, సిబ్బంది సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు.

దాదాపు 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నప్పటికీ వారికి వేతనాలు ఎంత మాత్రమూ పెరగడం లేదు. ఇప్పటికీ సూపరింటెండెండ్లకు నెలకు రూ.నాలుగు వేలు, టీచర్లకు రూ.మూడువేలు, ఆయాలు, అటెండర్లకు రూ.వెయ్యి మాత్రమే జీతంగా చెల్లిస్తున్నారు. అది కూడా మూణ్నెళ్లకు ఒకసారి ఇవ్వడంతో పలువురు సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేమంటే మీరు చేసేది పార్ట్‌టైం జాబ్​యేగా అంటూ ఉన్నతాధికారులు ఎగతాళి చేస్తున్నారు. వేతనాలను పెంచాలంటూ రెండేండ్ల నుంచి జవహర్‌ బాలభవన్‌ డైరెక్టర్‌.. సచివాలయంలోని ఉన్నతాధికారులకు ప్రతిపాదనల మీద ప్రతిపాదనలు పంపుతున్నారు. అయితే సెక్రటేరియట్‌లోని పెద్దలు పలు కొర్రీలు వేసి ఫైళ్లను డైరెక్టరేట్‌కే తిప్పి పంపుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఎట్టకేలకు ఇటీవలే ఫైల్​ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పేషీకి చేరింది. ఇది జరిగి ఆరేడు నెలలైనా దానికి మోక్షం లభించడం లేదని బాలకేంద్రాల్లోని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము ఎక్కువకాలం పిల్లలకు సేవలందించలేమని వారు తెగేసి చెబుతున్నారు.
పట్టించుకోని విద్యాశాఖ
మరోవైపు బాల కేంద్రాల్లోని సిబ్బందిని బాల భవన్‌లోని ఉద్యోగుల రెగ్యులర్‌ స్కేలుకు ప్రమోట్‌ చేయొచ్చంటూ ప్రభుత్వం గతంలో జీవోనెం.167ను విడుదల చేసినా దాన్ని విద్యాశాఖ పట్టించుకోవటం లేదు. ఈ ఉత్తర్వు అమలుకు నోచుకోకపోవడంతో సీనియారిటీ ఉన్న అనేక మంది శిక్షకులు.. చాలా తక్కువ జీతంతోనే ఉద్యోగ విమరణ పొందుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్నప్పటికీ ఇక్కడి సిబ్బందికి సర్కారు అమల్జేసే ఆరోగ్య బీమాలాంటి పథకాలేవీ వర్తించవు. ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌ సౌకర్యం కూడా వర్తించకపోవడంతో బాలకేంద్రాల్లో పనిచేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.
:: సారథి న్యూస్, హైదరాబాద్​