Breaking News

స్త్రీ నిధి రుణాల స్వాహా పై చర్యలు ఏవి..?

– దొరికితేనే దొంగ… లేకుంటే దొర..
– విచారణ ముగిసినా సీసీ పై నో యాక్షన్
– సీసీ తో కుమ్మక్కైన డీఆర్డీఏ అధికారులు
– రికవరీతో అక్రమాలను మూసిపెట్టేందుకు అధికారుల ప్రయత్నాలు
– రికవరీ తో పాటు సీసీ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటున్న మహిళా సంఘాలు

సామాజిక సారథి , నాగర్ కర్నూల్ బ్యూరో:
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ ముగిసినా బాధ్యులపై డీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలోని కేవలం ఒక్క మండలంలోనే సీసీ స్థాయి సిబ్బంది చేసిన అవినీతి 40 లక్ష ల కు చేరినా డీఆర్డీఏ అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. స్త్రీ నిధి రుణాల చెల్లింపుల్లో తీగ లాగితే డొంక కదులుతుందని అందరు భావించినా అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలోనే అవినీతి, అక్రమాలను తొక్కిపెడుతున్నారు. స్త్రీ నిధి రుణాల అవినీతి, అక్రమాలలో గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తలా పాపం తిలా పిడికెడు అన్న చందంగా ప్రతి ఒక్కరి పాత్ర ఉండడంతో బిజినపల్లి మండలం ఇష్యూను ఇక్కడే ముగించేందుకు అధికారులు స్కెచ్ వేసి అమలు చేయడం విశేషం. నిరుపేద మహిళలు కూలీ పనులు చేసి సంపాధించిన డబ్బులను మహిళ సంఘాలలో జమ చేసుకోవడం, తమ అవసరాలను బట్టి రుణాలు తీసుకున్నా వాటిని ప్రతి నెల ఠంచన్ గా చెల్లిస్తున్నా డీఆర్డీఓ అధికారులు మాత్రం అందిన కాడికి మహిళా సంఘాల సొమ్మును దర్జాగా అవినీతికి పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.


రికవరీతో ముగించేస్తారా..?

బిజినపల్లి మండలంలో స్త్రీ నిధి రుణాలతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రుణాల చెల్లింపుల్లోనూ సీసీ కమల అవినీతి, అక్రమాలు లక్ష ల రూపాయలకు చేరినట్లు సాక్షాత్తూ అధికారుల విచారణ లో తేలింది. వాస్తవానికి ఇంకాస్తా లోతుగా విచారణ చేస్తే మరింత అవినీతి వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నా విచారణ అధికారులతో పాటు డీఆర్డీఓ అధికారులు మాత్రం ఆ దిశగా విచారణ చేపట్టలేదు. పైగా వెలుగు చూసిన అవినీతి ఢబ్బులను మాత్రం సీసీ కమల చేత రికవరీ చేయించి మహిళల రుణాలను బ్యాంక్ లో క్లియర్ చేయిస్తే చాలన్నట్లు గా జిల్లా స్థాయి అధికారులు వ్యవహరిస్తుండడం పై మహిళా సంఘాల సభ్యులు మండి పడుతున్నారు. ఈ అవినీతి వెలుగులోకి వస్తేనే అధికారులు స్పందించడం ఏంటనీ వెలుగులోకి రాకుండా కోట్లు స్వాహా చేసినా పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా సీసీ కమల స్వాహా చేసిన సొమ్ము ను కేవలం రికవరీ చేయిస్తే సరిపోదని చేసిన అక్రమాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో నిరుపేద, చదువురాని మహిళలు ఉండడంతో అనేక చోట్ల అవినీతి, అక్రమాలు లక్ష ల రూపాయి లు దాటినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అక్రమాలు చేసిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికారులు అవినీతి పరులకు అండగా ఉంటూ తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.