Breaking News

మంత్రి నిరంజన్‌రెడ్డికి నిరసన సెగ

మంత్రి నిరంజన్‌ రెడ్డికి నిరసన సెగ
  • ముత్తిరెడ్డిగూడెంలో అడ్డుకున్న బీజేవైఎం కార్యకర్తలు

సామాజికసారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొన్నేందుకు వెళ్లిన మంత్రిని బీజేవైఎం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముత్తిరెడ్డిగూడెం రైల్వే గేటు నుంచి ట్రాక్టర్‌నడుపుకుంటూ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా మంత్రి వెంట వెళ్తున్న టీఆర్ఎస్​నాయకులు, కార్యకర్తలు ‘జై కేసీఆర్‌’ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు యాదాద్రీశుడిని మంత్రి నిరంజన్‌రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కొండపై పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతి చెందేలా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి కొనియాడారు. బస్వాపురం రిజర్వాయర్‌ద్వారా కాళేశ్వరం నీళ్లతో లక్ష్మీ నరసింహ స్వామి పాదాలను పునీతం చేయనున్నారని వెల్లడించారు. స్వామివారి దర్శనం తర్వాత తిరిగి వెళ్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డిని దుకాణదారులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్‌హామీ మేరకు వ్యాపారులకు తిరిగి కొండపైనే షాపులు కేటాయించాలని డిమాండ్‌చేస్తూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని మంత్రి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు దుకాణదారుల రిలే నిరాహార దీక్ష నేటితో 10వ రోజుకు చేరింది.