Breaking News

బీఈడీ ఫస్ట్ ర్యాంకర్ మనోడే

బీఈడీ ఫస్ట్ ర్యాంకర్ మనోడే

  • రైతుబిడ్డకు రాష్ట్రస్థాయి ర్యాంక్
  • సత్తాచాటిన నాగర్ కర్నూల్ జిల్లా యువకుడు ఎం.నవీన్ కుమార్
  • 150 మార్కులకు 118 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్

సామాజికసారథి, నాగర్ కర్నూల్: సాధారణ రైతు కుటుంబంలో పుట్టినబిడ్డ రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించాడు. మంగళవారం విడుదలైన బీఈడీ(టీజీ ఎడ్ సెట్) ఎంట్రెన్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఎం.నవీన్ కుమార్ స్టేట్ 1 ర్యాంక్ సాధించాడు. బీఈడీ ఎంట్రెన్స్​ (హాల్ టికెట్ నం.2415307073) 150 మార్కులకు 118 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి, విజయమ్మకు ఇద్దరు సంతానం కాగా, పెద్దకుమారుడు ఎం.నవీన్ కుమార్ తన సత్తాచాటి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇతను బిజినేపల్లిలోని శ్రీ సరస్వతి విద్యానికేతన్ లో 10వ తరగతి పూర్తిచేసి కొత్తకోట జయలక్ష్మి జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేశాడు. అనంతరం హైదరాబాద్ లో బీటెక్ పూర్తిచేశాడు. తన లక్ష్యం గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని బీఈడీ ఎంట్రెన్స్ ను క్యాజువల్ గానే రాశానని నవీన్ కుమార్ తెలిపారు. పోటీపరీక్షలకు పక్కా ప్రణాళికతో చదివితే సులభంగా మంచి ర్యాంక్ ను సాధించొచ్చని అన్నారు. ఇదేస్ఫూర్తితో తర్వాత గ్రూప్స్ పరీక్షలకు సీరియస్ గా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ సాధించేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. రైతుబిడ్డకు రాష్ట్రస్థాయి ర్యాంక్ రావడంతో అల్లీపూర్ గ్రామస్తులతో పాటు జిల్లా ప్రజలు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.