Breaking News

సంజయే సూత్రధారి

సంజయే సూత్రధారి
  • వీడిన గొర్రెకుంట మర్డర్ మిస్టరీ
  • పప్పన్నంలో నిద్ర మాత్రలు కలిపి..
  • ప్రియురాలి కోసం 9 మంది దారుణ హత్య
  • వెల్లడించిన వరంగల్ సీపీ రవీందర్

సారథి న్యూస్, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట హత్యల వెనక మిస్టరీని పోలీసులు ఛేదించారు. పప్పన్నంలో నిద్రమాత్రలు కలిపి 9 మందిని హత్య చేశాడు నిందితుడు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్‌ యాదవ్‌ను సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వరంగల్ సీపీ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 21న గొర్రెకుంట బావి నుంచి 4 మృతదేహాలను, రెండో రోజు మరో ఐదింటిని వెలికితీశారు. కేసు ఛేదనలో ఆరు బృందాలు పని చేశాయి. మొదట హత్యా, ఆత్మహత్యా? అనే కోణంలో విచారణ జరపగా, చివరకు హత్యగా తేలింది. సీసీఎస్, టాస్క్ ఫోర్స్, టెక్నికల్ ఇతర బృందాలు 72 గంటల్లో కేసును ఛేదించాయి.

ప్రేమ వ్యవహారమే..
మక్సూద్ ఫ్యామిలీలో మొత్తం ఆరుగురు ఉన్నారు. గోనె సంచుల కంపెనీలో పని చేస్తున్నారు.. శాంతినగర్‌లో పనిచేస్తుండగా సంజయ్ కుమార్ అనే బిహారీ వ్యక్తితో వీరికి పరిచయం ఏర్పడింది. నిషా ఆలం అక్క కూతురు రఫికా వెస్ట్ బెంగాల్ నుంచి తన ముగ్గురు పిల్లలతో వరంగల్‌కు వచ్చింది. ఆ క్రమంలో గోనె సంచుల ఫ్యాక్టరీలో పని చేయడం మొదలుపెట్టింది. సంజయ్ కుమార్ యాదవ్‌కు భోజనం వండి పెడుతూ డబ్బులు తీసుకునేది. అలా రఫికాకు, సంజయ్‌కు సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో వీరు వేరే రూమ్ తీసుకుని సహజీవనం సాగించడం మొదలుపెట్టారు. అదే సమయంలో యుక్త వయస్సుకు వచ్చిన రఫికా కూతురుతో సంజయ్ చనువుగా ఉండడం మొదలుపెట్టాడు. ఇది మంచి పద్ధతి కాదని, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఇప్పుడు తన కూతురితో అలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించింది. ఇది ఇలాగే జరిగితే పెద్దల వరకు విషయం వెళుతుందని హెచ్చరించింది.

రఫికాను తప్పించుకునేందుకు..
రఫికా పోరు నుంచి తప్పించుకోవడానిక ఓ ప్లాన్ వేశాడు. పెద్దలతో మాట్లాడదామని రఫీకాను ఏమార్చాడు. వారిద్దరు మార్చిలో వెస్ట్ బెంగాల్‌కు వెళ్లడానికి వరంగల్ నుంచి గరీభ్ రథ్ ఎక్స్ ప్రెస్‌లో బయలుదేరారు. ఆమెను అడ్డు తగులుతుందనే ఆలోచనల్లో ఉన్న సంజయ్.. మజ్జిగలో నిద్రమాత్రలు వేసి… మూడు గంటల సమయంలో ఆమెను చున్నీతో చంపేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక ట్రైన్ నుంచి బయటకు తోసేశాడు. తాడేపల్లిగూడెం పరిధిలో దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ రోజు రాజమండ్రిలో దిగి అక్కడి నుంచి వరంగల్‌కు వచ్చాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు తన పనుల్లో తాను మునిగిపోయాడు.

భోజనంలో నిద్రమాత్రలు కలిపి

రోజులు గడుస్తున్న రఫికా సమచారం తెలియకపోవడంతో సంజయ్‌ను మక్సూద్ కుటుంబం అడగడం మొదలుపెట్టింది. తమ అక్క కూతురు ఎక్కడ ఉందని ప్రశ్నించగా తను బెంగాల్ వెళ్లిందని చెప్పాడు. ఇక అనుమానం పెరిగి.. చెప్పకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడంతో హత్యకు ప్లాన్ చేశాడు. ఈనెల 16 నుంచి 20 వరకు రోజూ మర్డర్‌కు చేయాల్సిన ప్లాన్ రచించాడు. రోజూ మక్సూద్ ఉండే గోనె సంచుల ఫ్యాక్టరీకి వెళ్లి మొత్తం చూసుకుని వచ్చేవాడు. 20వ తేదీని తన మర్డర్‌కు అనుకూలమైన రోజుగా ఎంచుకున్నాడు. ఆరోజు మక్సూద్ పెద్ద కుమారుడు షాబాజ్ పుట్టిన రోజు. ప్లాన్ అమలు చేయడానికి అదే సరైన సమయం అనుకున్నాడు. ఆ రోజు హన్మకొండ చౌరస్తాలో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాడు. సాయంత్రం 6.30 గంటలకు సైకిల్‌పై ఫ్యాక్టరీకి వచ్చాడు. అందరూ ఇంటి బయట కూర్చుని మాట్లాడుతుండగా.. వంటింట్లోకి వెళ్లి నిద్రమాత్రలు పొడి చేసి.. వాళ్లు తినే ఆహారంలో కలిపాడు. అలాగే అక్కడే మిద్దెపై ఉండే శ్రీరామ్, శ్యామ్ అనే వాళ్ల ఆహారంలో కూడా కలిపాడు.

ఫ్యాక్టరీ ఆఫీసుకు వచ్చిన షకీల్ అనే వ్యక్తి మక్సూద్ ఇంట్లో భోజనం చేశాడు. అలా వాళ్లందరూ పూర్తి మత్తులోకి వెళ్లిపోయారు. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఒక్కొక్కరినీ గోనె సంచుల్లో వేసి.. దగ్గరలో ఉన్న బావిలో వేసేశాడు. అలాగే పైనుంచి ఇద్దరిని భుజాలపై తీసుకువచ్చాడు. వారిని కూడా గోనె సంచుల్లో వేసి బావిలో పడేశాడు. అలా మొత్తం 9 మందిని అత్యంత క్రూరంగా చంపేశాడు. ఇలా తెల్లవారుజామున 5 గంటల వరకు పని పూర్తి చేసుకుని.. సైకిల్‌పై 5.30 గంటలకు ఇంటికి వెళ్లిపోయాడు. రఫికా హత్యను కప్పి పుచ్చుకోవడానికి మొత్తం 9 మందిని సంజయ్ హత్య చేశాడు. రిమాండ్‌కు తరలించి పక్కా ఆధారాలతో కఠిన శిక్ష పడేలా చేస్తామని కమిషనర్ రవీందర్ తెలిపారు. రఫికా ముగ్గురు పిల్లలను హోమ్ కు తరలించినట్టు చెప్పారు.