Breaking News

పృథ్వీకి సాయం చేశా: సచిన్

పృథ్వీకి సాయం చేశా: సచిన్

క్రికెట్, లైఫ్ గురించి అతనితో చాలా సార్లు మాట్లాడా..

న్యూఢిల్లీ: డోపింగ్, క్రమశిక్షణరాహిత్యంతో ఒడిదుడుకులు ఎదుర్కొన్న టీమిండియా యంగ్ బ్యాట్ మెన్ పృథ్వీషాకు సాయం చేశానని లెజెండరీ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. ఫస్ట్ టెస్టులోనే సెంచరీతో సంచలన అరంగేట్రం చేసిన 20 ఏళ్ల షా ఆ తర్వాత గాయం, డోప్‌ టెస్టులో ఫెయిలై 16 నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు.

అతనిలో క్రమశిక్షణ లోపించిందని క్రికెట్‌ సర్కిళ్లలో చర్చ నడిచింది. ఇలాంటి టఫ్‌ టైమ్‌లోనే షాలో మాస్టర్‌‌ స్ఫూర్తి నింపాడు. క్రికెట్ లైఫ్, పర్సనల్‌ లైఫ్ విషయంలో మార్గనిర్దేశం చేసిన అతని కెరీర్ మళ్లీ గాడిలో పడేలా చేశాడు. ‘కొన్నేళ్లుగా పృథ్వీ షాతో నేను చాలాసార్లు మాట్లాడా.

అతను చాలా టాలెంటెడ్ ప్లేయర్. అతనికి హెల్ప్‌ చేసినందుకు నేను హ్యాపీ. ఆట గురించి, క్రికెట్‌ అవతలి లైఫ్ గురించి అతనికి చాలా విషయాలు చెప్పా’ అని సచిన్ పేర్కొన్నాడు. అయితే, అతనితో ఏం మాట్లాడానో చెప్పేందుకు మాత్రం మాస్టర్ నిరాకరించాడు. ‘ఒక యంగ్‌ స్టర్‌‌ నా దగ్గరికి వచ్చి, గైడెన్స్‌ కావాలని అడిగినప్పుడు..

అందులో రహస్యంగా ఉంచాల్సిన అంశాలు కూడా ఉంటాయి. అందువల్ల షాతో ఏం మాట్లాడానో నేను వెల్లడించలేను. వాటి గురించి పృథ్వీ చెప్పాలనుకుంటే ఓకే. అది అతని చాయిస్’ అని సచిన్ చెప్పుకొచ్చాడు.

యంగ్‌ స్టర్స్ను గైడ్ చేసేందుకు తానెప్పుడూ సిద్ధమేనన్నాడు. పృథ్వీనే కాకుండా ఇప్పటికే చాలా మంది యువకులతో వ్యక్తిగతంగా మాట్లాడి గేమ్‌ విషయంలో వాళ్లకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చినట్టు సచిన్ చెప్పాడు.