Breaking News

చచ్చిపోదామనుకున్నా..

న్యూఢిల్లీ: జట్టులో చోటు దక్కకపోవడం, సరైన ఫామ్​లో లేకపోవడంతో… దాదాపు రెండు నెలలు కుంగుబాటుకు లోనయ్యానని వెటరన్ బ్యాట్స్​మెన్​ రాబిన్ ఉతప్ప అన్నాడు. ఓ దశలో ఆత్మహత్య కూడా చేసుకుందామన్న ఆలోచనలు కూడా వచ్చాయన్నాడు. ‘నా కెరీర్​లో 2009 నుంచి 2011 వరకు రెండేళ్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. ఎప్పుడూ కుంగుబాటుతో బాధపడేవాడిని. క్రికెట్ గురించి ఆలోచించిన సందర్భాలు లేనేలేవు. ఎప్పుడూ ఆత్మహత్య ఆలోచనలే. నేను వెళ్తున్న దారి సరైందో కాదో కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఓ రోజు బాల్కనీలో కూర్చున్నా. ఆత్మహత్య ఆలోచనల రావడంతో బాల్కనీ నుంచి దూకబోయా. ఇంతలో ఏదో శక్తి నన్ను అడ్డుకుంది’ అని ఉతప్ప పేర్కొన్నాడు. మానసిక నిపుణుల సాయంతో తాను ఈ కుంగుబాటు నుంచి బయటపడ్డానని చెప్పాడు. తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాలని చేసిన ప్రయత్నాలు చాలా రోజుల తర్వాత ఫలించాయన్నాడు.

‘వ్యక్తిగా నన్ను నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇందుకోసం వేరే వారి సాయం తీసుకున్నా. నెట్స్​లో తీవ్రంగా శ్రమించినా పరుగులు చేయలేకపోవాడిని. ఇలా కొన్ని రోజులు కష్టాలు ఎదురైనా.. తర్వాతి దశల్లో అనుకున్న ఫలితాలు వచ్చాయి’ అని ఈ కర్ణాటక బ్యాట్స్​మెన్​ వివరించాడు. మానసికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను అంగీకరించాలన్నాడు. కొన్నిసార్లు తప్పులను అంగీకరించలేక వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తామన్న ఉతప్ప… వాటి వల్లే విజయవంతం కాలేమని చెప్పాడు. జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను సమంగా తీసుకుంటే కచ్చితంగా ఉన్నత శిఖరాలను చేరుకుంటామని ఉతప్ప ఆశాభావం వ్యక్తం చేశాడు.