Breaking News

ఓవైపు కేన్సర్.. మరోవైపు కరోనా

న్యూఢిల్లీ: కాలేయ కేన్సర్​తో పోరాడుతున్న భారత స్టార్ బాక్సర్ డింకో సింగ్​కు కరోనా వైరస్ సోకింది. ఢిల్లీలో కీమోథెరపీ చేయించుకుని మణిపూర్ తిరిగి వచ్చిన తర్వాత అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో పాజిటివ్​గా తేలడంతో చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ బారినపడిన తొలి భారత క్రీడాకారుడు అతనే. ఆర్థిక ఇబ్బందుల్లో డింకోకు.. కీమో చేయించుకునేందుకు విజేందర్, ఇతర బాక్సర్లు సాయం అందించారు. దీంతో ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్​లో ఢిల్లీకి వెళ్లి కీమో చేయించుకున్నారు. కొన్ని రోజుల చికిత్స తర్వాత రోడ్డుమార్గం ద్వారా 2,700 కి.మీ.ప్రయాణించి మణిపూర్ చేరుకున్నాడు. ఢిల్లీలో ఉన్నప్పుడే తనకు వైరస్ సోకి ఉండొచ్చని డింకో భావిస్తున్నాడు.
హాకీ ఇండియా సిబ్బందికి కరోనా
మరోవైపు హాకీ ఇండియా (హెచ్ఐ) ఆఫీసులో పనిచేసే ఇద్దరు సిబ్బంది కరోనా బారినపడ్డారు. దీంతో ఢిల్లీలో ఉన్న హెచ్ఐ ఆఫీసును 14 రోజులపాటు మూసి ఉంచనున్నారు. ఆర్థిక విభాగంలో పనిచేసే ఉద్యోగితో పాటు జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్​కు వైరస్ సోకిందని హెచ్ఐ ప్రకటించింది. ఈ ఘటనతో భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ)మరింత అప్రత్తమైంది. అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలు, రాష్ట్ర ఒలింపిక్ సంఘాలు.. తమ సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించాలని ఐవోఏ ఆదేశించింది.