Breaking News

ఉమ్మివద్దు కానీ..

న్యూఢిల్లీ: బంతి రంగును మెరుగుపర్చేందుకు ఉమ్మిని నిషేధించడంపై టీమిండియా స్టార్ పేసర్ జస్​ప్రీత్​ బుమ్రా భిన్నంగా స్పందించాడు. ఉమ్మి కాకపోతే మరో ప్రత్యామ్నాయం చూపాలని కోరాడు. బంతిని మెరుగుపర్చకపోతే బౌలర్లకు తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు. ‘వికెట్ తీసిన తర్వాత కౌలిగింతలు, షేక్ హ్యాండ్స్ వద్దంటున్నారు. వ్యక్తిగతంగా నాకూ ఇవి ఇష్టం ఉండదు. కానీ ఉమ్మి విషయంలోనే అసలు సమస్య. ఉమ్మిని ఉపయోగించకుండా బంతిని ఎలా మెరుగుపర్చాలి. దీనికోసం మరో దానిని చూపించాల్సిందే. ఎందుకంటే బంతిని కాపాడుకోకపోతే బౌలర్లకు ఇబ్బందులు వస్తాయి. బంతిని షైన్ చేయకపోతే మామూలు స్వింగ్ కూడా కాదు. ఇక రివర్స్ స్వింగ్ కాకపోతే మ్యాచ్ బ్యాట్స్​ మెన్​కు అనుకూలంగా మారిపోతుంది’ అని బుమ్రా పేర్కొన్నాడు. ఇటీవల చాలా మ్యాచ్​ల్లో పరిస్థితులు పేసర్లకు అనుకూలంగా ఉన్నాయన్నాడు. టెస్ట్​ల్లో ఇది చాలా ఉందన్నాడు.

‘వన్డేల విషయానికొస్తే రెండు కొత్త బంతులు ఉంటాయి. అతికష్టమ్మీద చివరిలో రివర్స్‌ స్వింగ్‌ రాబట్టగలం. బాల్‌ స్వింగింగ్‌ గురించి బ్యాట్స్​మెన్​ ఫిర్యాదులు చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే బాల్‌ అంటేనే స్వింగ్‌ అవుతుంది. పైగా మా పని త్రోడౌన్స్‌ వేయడం కాదు కదా. భారత్ మళ్లీ ఎప్పుడు మ్యాచ్ ఆడుతుందో తెలియదు. ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో శరీరాన్ని సిద్ధం చేసుకుంటున్నా. మూడు నెలలకు పైగా బౌలింగ్‌ చేయకపోతే శరీరం ఎలా స్పందిస్తుందో అవుతుందో నాకు తెలియదు. అందుకే ట్రెయినింగ్‌ కొనసాగిస్తున్నా. వారంలో ఆరు రోజులు ప్రాక్టీస్‌ చేస్తున్నా. కానీ బౌలింగ్‌ వేయడం లేదు’అని బుమ్రా అన్నాడు.