Breaking News

పెద్దగట్టు జాతర తేదీలు ఖరారు

పెద్దగట్టు జాతర తేదీలు ఖరారు

సారథి న్యూస్​, సూర్యాపేట: రెండేళ్లకు ఒకసారి జరిగే.. తెలంగాణ రెండో అతిపెద్ద కుంభమేళాగా భావించే లింగమంతుల జాతరకు నగారా మోగింది. జాతర నిర్వహణపై సూర్యాపేటలోని క్యాంపు ఆఫీసులో గురువారం దేవాదాయశాఖ అధికారులు, యాదవ కులపెద్దలు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుని జాతర తేదీలను ఖరారు చేశారు. వేడుక ప్రారంభానికి 15 రోజులు ముందు అంటే 2021 ఫిబ్రవరి 14న ఆదివారం దిష్టిపూజ మహోత్సవం జరగనుంది. మాఘశుద్ధ తదియ తర్వాత వచ్చే రెండో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి దేవరపెట్టెను తీసుకురాగా, సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలను పెద్దగట్టుకు తీసుకొచ్చి అలంకరిస్తారు. ఫిబ్రవరి 28 మాఘ విదియ ఆదివారం నాడు ప్రారంభమయ్యే ఈ జాతర ఐదురోజుల పాటు జరుగుతుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్, జడ్పీటీసీ జీడీ భిక్షం పాల్గొన్నారు.
జాతరలో ముఖ్యమైన కార్యక్రమాలివే..
ఫిబ్రవరి 14న దిష్టిపూజ
ఫిబ్రవరి 28న కేసారం నుంచి దేవరపెట్టె తీసుకొచ్చుట, గంపల ప్రదక్షిణ
మార్చి 1న బోనాలు సమర్పించడం, ముద్దెరపాలు, జాగిలాలు
మార్చి 2న చంద్రపట్నం
మార్చి 3న పూజారులు నెలవారం చేయడం
మార్చి 4న జాతర ముగింపు, మకరతోరణం ఊరేగింపు