![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/smith.jpeg?fit=1280%2C923&ssl=1)
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్
జొహన్నెస్ బర్గ్: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.. ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపడితే బాగుంటుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. ఈనెలలో దిగిపోనున్న శశాంక్ మనోహర్ స్థానాన్ని దాదా భర్తీ చేయాలన్నాడు. ‘గంగూలీ అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడాడు. కాబట్టి క్రికెట్ పై ఆయనకు పూర్తి అవగాహన ఉంటుంది. ఇతర విషయాలను కూడా బాగా అర్థం చేసుకుంటాడు. అందుకే దాదాలాంటి వ్యక్తి ఐసీసీ బాధ్యతలు తీసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. క్రికెట్కు కూడా భారీగా లాభం చేకూరుతుంది. ఇతర దేశాల బోర్డులు కూడా దాదాపు బాగా గౌరవిస్తాయి. మంచి నాయకుడి సారథ్యంలో ముందుకెళ్లడానికి మాకు కూడా ఇబ్బందులు ఉండవు’ అని స్మిత్ అభిప్రాయపడ్డాడు. స్మిత్ వ్యాఖ్యలతో క్రికెట్ దక్షిణాఫ్రికా సీఈవో జాక్వెస్ పాల్ కూడా ఏకీభవించాడు. ఇందులో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నాడు. ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.