Breaking News

కరోనా సబ్​ స్టిట్యూట్​ ను ఇవ్వండి

లండన్: కరోనా దెబ్బకు కుదేలైన క్రికెట్​ను మళ్లీ గాడిలో పెట్టేందుకు అన్నిదేశాల బోర్డులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వైరస్ బారినపడకుండా ఆటలో కొన్ని మార్పులను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రతిపాదించింది. ఈ మేరకు ఐసీసీతో చర్చలు జరుపుతోంది. వెస్టిండీస్, పాకిస్థాన్​తో జరగబోయే టెస్ట్ సిరీస్​ ‘కరోనా సబ్​ స్టిట్యూట్​’ను ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం టెస్ట్​ల్లో కంకూషన్ సబ్​ స్టిట్యూట్ మాత్రమే ఉంది. ఇప్పుడు కరోనావ్యాప్తి నేపథ్యంలో ఎవరైనా ప్లేయర్ కు కొవిడ్ లక్షణాలు ఉంటే వాళ్ల స్థానంలో మరొకరిని ఆడించుకునే వెసులుబాటు ఇవ్వాలని ఈసీబీ కోరుతోంది.

‘ఐసీసీ ముందు మేం కొన్ని ప్రతిపాదనలు ఉంచాం. వాటికి ఆమోదముద్ర పడాల్సి ఉంది. టెస్ట్ సిరీస్ ప్రారంభమయ్యేనాటికి అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. క్రికెట్​ను సురక్షితంగా మొదలుపెట్టాలన్నదే మా ఉద్దేశం. టెస్ట్​లకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. వన్డే, టీ20ల్లో పాతరూల్స్ ఉంటాయి’ అని ఈసీబీ డైరెక్టర్ స్టీవ్ ఎల్వర్తి అన్నాడు. పాక్, విండీస్ సిరీస్​లను పూర్తి బయోసెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తామని ఎల్వరీ స్పష్టం చేశాడు. అయితే తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడే ఇవి జరుగుతాయన్నాడు. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనకు విండీస్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.