- ఒమిక్రాన్ఎఫెక్ట్
- చిన్నారులపై ప్రభావం
- నిర్లక్ష్యమే కారణం
- జాగ్రత్తలు సూచిస్తున్న నిపుణులు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ చిన్నారులపై తీవ్రప్రభావం చూపుతోంది. దేశరాజధాని ఢిల్లీలో ఈనెల 9 నుంచి 12 తేదీల మధ్యలోనే ఏడుగురు చిన్నారులు మృతిచెందినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్కూడా విస్తృతంగా లేకపోవడంతో రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దవారిలో లక్షణాలు కనిపించకపోగా వారిలో ఇబ్బందులు తక్కువగానే ఉంటున్నాయి. పిల్లల్లో వాంతులు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. బయట నుంచి రాగానే శానిటైజ్ చేసుకోకుండా పిల్లలను ముట్టుకోవడం, అంటిపెట్టుకోవడం, కొవిడ్ అనుమానంతో ఉన్నా వారితో చనువుగా ఉండటం, ఇంట్లో పెద్దలు బయటకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించకపోవడం వంటివి పిల్లలపైనా ప్రభావం చూపిస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నాయి.
- కరోనా విజృంభణ
దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 2,71,202 కేసులు నిర్ధారణ అయ్యాయి. 314 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 15.50 లక్షల దాటింది. డెయిలీ పాజిటివిటీ రేటు 16.28 శాతానికి పెరిగింది. అందులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7,743కు చేరింది. తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో.. దాదాపుగా అన్ని రాష్ట్రాలూ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. గతంలో డెల్టా వేరియంట్, ఇతర ఆల్పా, గామా, బీటా, కప్ప వేరియంట్ సోకిన వారు మళ్లీ వైరస్ బారినపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కు వచ్చిందని వైరాలజిస్టులు భావిస్తున్నారు.
- డాక్టర్లు ఏమంటున్నారు..
‘కొవిడ్ ఇన్ఫెక్షన్ చిన్నపిల్లలపై అంతగా ప్రభావం చూపించదనే మాటను పక్కకుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలను కరోనా నుంచి కాపాడుకోవడానికి అదనపు భద్రతను కల్పించాలి. డెల్టా వేరియంట్ కంటే వేగవంతంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ తీవ్రత తక్కువే. అలా అని నిర్లక్ష్యపెట్టడానికి వీల్లేదు. చిన్నపిల్లల్లోనే కొవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఒమిక్రాన్ లక్షణాలతో సతమతమవుతున్నారు.’ అని డాక్టర్లు సూచిస్తున్నారు.