Breaking News

బత్తాయి, నిమ్మరైతులకు బాసట

బత్తాయి, నిమ్మరైతులకు బాసట

రైతులకు ప్రభుత్వం బాసటగా..

మార్కెట్​ లో బత్తాయి కాయలను
పరిశీలిస్తున్న మంత్రి జగదీశ్​ రెడ్డి

సారథి న్యూస్​, నల్లగొండ: సీఎం కేసీఆర్ ఆశించిన మేర తెలంగాణ ధాన్యభాండాగారంగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కరోనా వైరస్ ప్రబలడంతో ఆ సంతోషాన్ని రైతులతో పంచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా వైరస్ ను నిరోధించేందుకు బత్తాయి జ్యుస్ దోహదపడుతుందని చెప్పారు. బత్తాయి, నిమ్మ రైతులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఆయన స్పష్టంచేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మార్కెట్ లో బత్తాయి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జగదీశ్​ రెడ్డి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్, జడ్పీ చైర్మన్​ బండా నరేందర్ రెడ్డి, స్థానిక ఎమ్యెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రెండు దశాబ్దాల నుంచి ఉందన్నారు. రైతుల డిమాండ్ మేరకు నల్లగొండలో బత్తాయి, నకిరేకల్​లో నిమ్మ మార్కెట్​ ను ప్రారంభించామని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ  421, సూర్యాపేటలో 271, యాదాద్రి భువనగిరి 245 కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించినట్లు చెప్పారు. మూడు జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం 4,31,276 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ఇప్పటి వరకు 2.36లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సూర్యపేట జిల్లాలో 1,69,983 మెట్రిక్ టన్నులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 25,280 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫంక్షన్ హాళ్లను ఎరువుల విక్రయ కేంద్రాలుగా ఏర్పాటు చేసుకోవాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారని వివరించారు. ముందుగా ఎరువులు కొనాలనుకునే రైతులు అధికారులను సంప్రదించాలని సూచించారు.

2 thoughts on “బత్తాయి, నిమ్మరైతులకు బాసట

Comments are closed.