Breaking News

బుద్ధి మందగించినోళ్లను లెక్కచేయను

బుద్ధి మందగించినోళ్లను లెక్కచేయను
  • అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా
  • రూ.100కోట్లతో బిజినేపల్లిలో మార్కండేయ లిఫ్ట్
  • ప్రారంభోత్సవానికి రేపు మంత్రి కేటీఆర్ రాక
  • నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
    సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: తాను ఏ విషయంలోనైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే 24 గంటల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రతిపక్షాలకు వాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని బిజినేపల్లిలో ఐదువేల గిరిజన జనాభాకు సాగు, తాగునీరు అందించే బృహత్తర పథకం మార్కండేయ లిఫ్ట్ రూ.100 కోట్లతో నిర్మించనున్నట్లు వెల్లడించారు. నిర్మాణ పనులను ఆరునెలల్లో పూర్తి చేయిస్తామన్నారు. కృష్ణాజలాలతో గిరిజనుల పాదాలను అభిషేకిస్తామని తెలిపారు. గిరిజనుల బతుకులకు భరోసా కల్పిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో రూ.35కోట్లతో మిషన్ భగీరథతో తాగునీళ్లు, రూ.90 కోట్లతో భూగర్భడ్రైనేజీ, టౌన్ హాల్, వెజ్,‌ నాన్ వెజ్ మార్కెట్లు, గ్రంథాలయం, బ్రిడ్జి, రోడ్లు.. ఇలా రూ.400కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాకు మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు త్వరలోనే సీఎం కేసీఆర్​చేతుల మీదుగా ప్రారంభం ఉంటుందన్నారు.
    వారి మాటలు లెక్కచేయను
    గతంలో కళ్లారా చూస్తామా అనుకున్న అభివృద్ధిని చేతల్లో చూపించానన్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్న బుద్ధి మందగించినోళ్ల మాటలను లెక్కచేయనన్నారు. తన జెండా, ఎజెండా నాగర్‌కర్నూల్ అభివృద్ధి మాత్రమేనని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు తిరస్కరిస్తే ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారని మాజీమంత్రి నాగం జనార్దన్​రెడ్డిపై ఎమ్మెల్యే విమర్శలు చేశారు. పనీపాటా లేక కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తే పెద్దోడివి అవుతావనుకుంటే నీ విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. నాగర్‌కర్నూల్ ప్రజలకు ఏంచేయాలో తనకంటూ ఓ విజన్ ఉందన్నారు. విద్యారంగం అభివృద్ధిపై దృష్టి సారిస్తానన్నారు. వచ్చేసారి పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకొస్తానన్నారు. 18న బిజినేపల్లిలో 30వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ హనుమంతరావు, టీఆఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బైకాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన, మర్రి యువసేన నాయకుడు భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.