Breaking News

సొమ్ము సర్కారుది….సోకు డీఈఓ ది..

సామాజిక సారథి,వనపర్తి: స్వంత పనులకు సర్కారు కారు ను వాడుకోవద్దన్న రూల్ వనపర్తి డీఈఓ రవీందర్ కు పట్టడం లేదు.వనపర్తి డీఈఓగా రవీందర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అవినీతి, ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేయకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారు.

డీఈఓ గా వనపర్తి జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల ను విజిట్ చేయాల్సిన రవీందర్ సర్కారు స్కూళ్ల ను గాలికొదిలేశారు. తన సొంత గ్రామం మహబూబ్ నగర్ కావడంతో సర్కారు ఇచ్చిన కారును దర్జాగా తన ఇంటికి తీసుకెళ్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్రతి రోజు మహబూబ్ నగర్ నుంచి వనపర్తి కి వచ్చివెళ్లేందుకు సుమారు 150 కిలోమీటర్లు అవుతుండడంతో లాగ్ బుక్ లో ఆ దూరాన్ని కవర్ చేసేందుకు ప్రభుత్వ స్కూళ్లను విజిట్ చేసినట్లు తప్పుడు లెక్కలు రాసుకుంటున్నారు. అంతే కాదు తన వద్ద 24 గంటలు కారు ఉంచాల్సీందేనని లేకుంటే అగ్రిమెంట్ రద్దు చేస్తానని కారు ఓనర్ ను సైతం బెదిరించినట్లు తెలిసింది. తనకు వీలుగా ఉండేందుకు కారు ఓనర్ ను పక్కన పెట్టి మహబూబ్ నగర్ టౌన్ కు చెందిన డ్రైవర్ ను ఏర్పాటు చేసుకొని ఆ డ్రైవర్ జీతంతో పాటు డీజిల్ ఖర్చులను మొత్తం అద్దెకు పెట్టిన ఓనర్ నుంచే వసూలు చేస్తుండడంతో తనకు ఏమీ గిట్టుబాటు కావడం లేదని కారు ఓనర్ బోరుమంటున్నాడు. ఇందేటనీ అడిగితే నీ కారు ను తొలగించి తనకు అనుకూలంగా ఉన్న కారు ను అద్దె పెట్టుకుంటానని బెదిరిస్తుండడంతో ఎవ్వరికి చెప్పుకోలేక కారు ఓనర్ నలిగిపోతున్నాడు. ఇప్పటికైనా వనపర్తి జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.