- రాఘవేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ లేనట్లే?
- హస్తం గూటికి చేరినా లభించని హామీ
- చక్రం తిప్పిన వంశీచంద్‌రెడ్డి, జూపల్లి
- గులాబీ పార్టీ నుంచి బిగ్ ఆఫర్?
- ఎన్నికల నోటిఫికేషన్ వేళ పొలిటికల్ హీట్
- కల్వకుర్తిలో రసవత్తరంగా రాజకీయం
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సరిపోయినంతా డబ్బు ఉంది కదా.. రాజకీయం చేద్దామని ప్రజలకు సేవ పేరుతో, ఎంతో ఉత్సాహంతో కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అంతలోనే సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో కొద్దిరోజులు హల్ చల్ చేశారు. కాంగి‘రేసు’లో టికెట్ తనకే పక్కా అని చెప్పుకున్నా.. రానురాను పార్టీలో నేతల చేరికల పరిణామాలు మారుతుండటంతో డీలా పడిపోయారు. కొద్దిరోజులుగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇంతలోనే మరోనేత కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో కల్వకుర్తి హస్తం పార్టీలో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినవేళ స్థానిక రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చౌదర్ పల్లి గ్రామానికి చెందిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పుట్టింది మధ్య తరగతి కుటుంబమే అయినా అమెరికాలో స్థిరపడి వ్యాపారరంగంలో ఎదిగారు. పుట్టినగడ్డ కల్వకుర్తికి సేవ చేద్దామని వచ్చానని ఊరూరా తిరిగారు. సొంత కేడర్ ను సంపాదించుకున్నారు. ఐక్యతా ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇండిపెండెంట్ గానైనా సరే పోటీచేద్దామని భావించారు. ఇదే విషయాన్ని తన ఫాలోవర్స్ కు చెప్పారు. కానీ గెలుపుపై ఆశలేకపోవడంతో కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధిష్టానం టికెట్ తనకే ఇస్తుందని మొదట బాగా నమ్మారు. రేవంత్‌రెడ్డి తనకు చాలా దగ్గర అని చెప్పుకొచ్చారు. రోజులు గడుస్తున్నాకొద్దీ అధినాయకత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో గందరగోళంలో పడ్డారు. దీనికితోడు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ముఖ్యనేతలు, సీనియర్లు, కేడర్ నుంచి మద్దతు కూడా కరువైంది. ఇటీవల ఆయనకు కొందరు సీనియర్లు కూడా దూరమయ్యారు.
ఎమ్మెల్సీ కసిరెడ్డి ఎంట్రీ.. మారిన సీన్!
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. గతంలో ఆయన కల్వకుర్తి నుంచి పోటీచేద్దామని భావించినా ఆయనకు బీఆర్ఎస్ టికెట్ రాలేదు. 2023 ఎన్నికల్లోనూ మరోసారి నిరాశే ఎదురైంది. మాజీఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కూడా పోటీకి రెడీ అంటున్నారు. టికెట్ ను వదలుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో ఆయనను మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎంపీగా పోటీచేయించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన ఏఐసీసీ వ్యవహారాల్లో బిజీగా ఉండటం, రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితులు కావడం, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎక్కువ స్థానాలను గెలిస్తే వంశీచంద్‌రెడ్డిని రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. ఇక బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి టికెట్ దాదాపు ఖాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డికి టికెట్ రానట్లేనని తేలిపోయింది. దీంతో ఆయన పరిస్థితి గందరగోళంలో పడింది. నమ్మిన కాంగ్రెస్ నట్టేటా ముంచిందని సన్నిహితుల వద్ద నిట్టూర్చినట్లు తెలిసింది. కాగా, బీఆర్ఎస్లో కసిరెడ్డి నారాయణరెడ్డి స్థానాన్ని భర్తీచేసేందుకు, రెడ్డి సామాజికవర్గం ఓట్లను సంపాదించేందుకు సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డిని గులాబీ గూటికి అధిష్టానం ఆహ్వానించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయనకు రాష్ట్రస్థాయిలో కీలక పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సుంకిరెడ్డి.. రాజకీయపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అభిమానులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. చివరికి ఆయన దారెటో వేచి చూడాల్సిందే..!