- టీడీపీ అధినేత చంద్రబాబు
- కుప్పం ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం
చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఇటీవల కాలంలో కరోనాతో బాధపడుతున్నవారు ఆక్సిజన్ లేక తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గానికి ఆక్సిజన్ కొరత ఉండకూడదని భవిష్యత్ కార్యాచరణతో ఈ ప్లాంట్ ను ప్రారంభించినట్లు తెలిపారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, కుప్పం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి విధ్వంసకరమైన పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాన్ని అన్నివిధాలుగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకరమైన పాలన పోవాలంటే ధర్మపోరాటం తప్పనిసరి అని, టీడీపీ ఇప్పుడు అదే చేస్తోందని చెప్పారు. ధర్మపోరాటానికి ప్రతిఒక్కరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. పొత్తులు ఉన్నప్పుడు గెలిచామని, లేనప్పుడూ గెలిచామన్నారు. కుప్పం ప్రజలకు తనకు ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉందని, అలాంటి దాన్ని గుండా చెడగొట్టారని అన్నారు. అందుకే ఇప్పుడు ఎమోషనల్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ ఈ రాష్టాన్న్రి సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. ఓటీఎస్లాగా జగన్కు ప్రజలు వన్ టైం పాలనను అందించారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కొత్త బిచ్చగాళ్లు అని, వారికి చరిత్ర తెలియదని ఎద్దేవాచేశారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను స్టాలిన్ సర్కారు కొనసాగిస్తుంటే.. ఏపీలో మాత్రం అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం మూసివేసిందని విమర్శించారు. ఈసారి పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తానని చంద్రబాబు అన్నారు.