
- మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చు
- ఆస్తుల పంపకాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి
- ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడంతో కాలయాపన
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: సమాజంలో విశ్వసనీయత కలిగిన వ్యక్తులు ముందుకు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారానికి తక్కువ సమయం పడుతుందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి చివరి ప్రత్యామ్నాయంగా కోర్టు తలుపులు తట్టాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ వివాదాల పరిష్కార కేంద్రం (ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ ఐఏఎంసీ) సన్నాహాక సదస్సులో సీఎం కేసీఆర్‌తో కలిసి ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులను సత్వరం విచారించాలని అన్నారు. ‘కోర్టులకు వచ్చే ముందు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకునేందుకు ప్రయత్నించాలి. మహాభారతంలో పాండవులు, కౌరవుల మద్య మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరిగాయి. సంప్రదింపుల ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చు. ఆస్తుల పంపకాలను కుటుంబసభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడంతో కాలయాపన జరుగుతున్నది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ సరైన వేదిక. సాధ్యమైనంత వరకు మహిళలు మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలి. విస్తృత సంప్రదింపులతో ఇరుపక్షాలకు ఆమోదయోగ్య పరిష్కారం సాధ్యం’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ అనువైంది
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతో చాలా మార్పులు వచ్చాయని, అదే క్రమంలో చట్టంలోనూ మార్పులు వచ్చాయని తెలిపారు. ఆ విధంగా 1996లో మధ్యవర్తిత్వ చట్టం వచ్చిందని గుర్తుచేశారు. విదేశీ పెట్టుబడిదారులు మన దేశంలో వివాదాల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందని అడుగుతున్నారని తన అనుభవాన్ని ఉటంకించారు. కేవలం పారిశ్రామిక వివాదాలే కాకుండా ఇతర వివాదాలను కూడా మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా పరిష్కరించుకునే వీలు కలుగుతుందని ఆయన వివరించారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రానికి హైదరాబాద్ అనువైందని సీజేఐ అభిప్రాయపడ్డారు. స్థలం కేటాయించేందుకు ముందుకొచ్చిన సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌ది పెద్దచేయి అంటూ, ఏదీచేసినా ఆర్భాటంగా చేస్తారని కితాబిచ్చారు.
పుప్పాలగూడలో స్థలం కేటాయింపు: సీఎం కేసీఆర్
హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం నిర్మించుకోవడం హర్షణీయమని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున సీజేఐకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఏఐఎంసీ కోసం 25వేల చదరపు అడుగుల స్థలం కేటాయించామనీ, పుప్పాలగూడలో శాశ్వత భవనానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మధ్యవర్తిత్వం దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో ప్రాచీన కాలం నుంచి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్నివిధాలుగా అనువైన ప్రాంతమని ఆయన వివరించారు.
అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి కేటీఆర్
మధ్యవర్తిత్వ కేంద్రానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. టీఎస్‌ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 17,500 పరిశ్రమలకు అనుమతులిచ్చామని చెప్పారు. రాష్ట్రానికి రూ.2,30,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించామని వివరించారు.