- వాకిళ్లలో ముగ్గులు
- విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
- 10న ముగింపు కార్యక్రమాలు
- మంత్రి కె.తారక రామారావు
సామాజిక సారథి, హైదరాబాద్: జనవరి 3 నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రైతుబంధు సంబరాలు నిర్వహించాలని టీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు సూచించారు. రైతుబంధు కార్యక్రమం ద్వారా రూ.50వేల కోట్లు రైతన్నల ఖాతాల్లోకి చేరిన శుభసందర్భంగా సెలబ్రేట్ చేసేందుకు మనమంతా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా జడ్పీ చైర్మన్లతో ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుబంధు సంబరాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్మాట్లాడుతూ.. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన కొవిడ్ పరిమితులను గుర్తించుకుని రైతుబంధు సంబరాలు నిర్వహించాలని కోరారు. ఎమ్మెల్యేలు ముందుండి నియోజకవర్గ పార్టీ శ్రేణులు అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని సూచించారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ముందు రైతుబంధు సంబంధిత ముగ్గులను వేసేలా మహిళలను ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థుల్లో రైతుబంధుపై ఉపన్యాస, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని కోరారు. ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు ఊరేగింపు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 2600కు పైగా ఉన్న రైతువేదికల వద్ద పండుగ వాతావరణంలో వేడుకలకు జనవరి 10న ముగింపు పలకాలని కోరారు. ఆయా నియోజకవర్గాల్లో రైతులకు చెందిన నిధుల వివరాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేయాలని, స్థానిక ప్రజలందరికీ చేరేలా ఎమ్మెల్యేలు సవివరమైన ఒక లేఖను రాస్తే బాగుంటుందన్నారు. అనంతరం వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..ఈ సంబరాలకు సంబంధించి ఎలాంటి సమాచారమైనా ఇచ్చేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందని ప్రకటించారు. అవసరమైన ప్రచార, సమాచార సామాగ్రిని సిద్ధంచేస్తున్నామని తెలిపారు. 43 లక్షల తెలంగాణ రైతులకు రైతుబంధు అందిస్తున్న అపురూప కార్యక్రమమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు.