Breaking News

మావోయిస్టుల ఆటలు సాగనివ్వం

మావోయిస్టుల ఆటలు సాగనివ్వం

  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు
  • ప్రజలు ఎవరూ నక్సల్స్ కు సహకరించవద్దు
  • వెంకటాపురం ఠాణాను సందర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి

సారథి న్యూస్, వాజేడు(ములుగు),భద్రాద్రి కొత్తగూడెం: కొంతకాలంగా ములుగు జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు లేవని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్​రెడ్డి అన్నారు. తెలంగాణలో నక్సలైట్ల అరాచకాలు, ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు. శనివారం ఆయన ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్​స్టేషన్​ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వారం రోజులుగా మావోయిస్టులు కదలికలపై అప్రమత్తమయ్యాం. కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి పొరుగు రాష్టం ఛత్తీస్ గఢ్​కు వలసవెళ్లి అక్కడే తల దాచుకుంటున్నారు. అక్కడ ఉండి ఎంతో మంది కాంట్రాక్టర్లు, వ్యాపారులను బెదిరిస్తూ ఉనికి చాటుకోవాలని చూస్తున్నారు. కానీ అక్కడ వారి పాచిక పారడం లేదు. కాబట్టి మళ్లీ తెలంగాణలోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారివద్ద నుంచి పక్కా ప్రణాళికతో డబ్బులు లాగడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తెలంగాణ పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉంది. మావోయిస్టు నేతలు జగన్, హరిభూషణ్​ఇద్దరు విలాసవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పోలీసుశాఖ 360 డిగ్రీస్​లో అన్నిరకాల చర్యలు తీసుకుంటుంది. చత్తీస్​గఢ్​రాష్ట్రంలో అమాయక గిరిజన యువతను తెలంగాణలోకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజల కోపానికి పరారయ్యారు. 40 ఏళ్లుగా నక్సల్స్ వల్ల ఛత్తీస్ గఢ్​ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. వారు తెలంగాణలోకి అడుగుపెట్టకుండా సమష్టిగా ఎదుర్కోవాలి. నక్సల్స్​జాడ తెలిస్తే పోలీసులకు తెలియజేయాలి’ అని డీజీపీ మహేందర్​ రెడ్డి ప్రజలకు సూచించారు.

రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో మావోయిస్టులకు కనీసం వసతి కూడా కల్పించకూడదని కోరారు. అంతకుముందు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని సింగరేణి అతిథిగృహంలో భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ కమిషనరేట్, మహబూబాబాద్​ జిల్లాకు చెందిన పోలీస్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి, వరంగల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, శ్రీనివాస్, శోభన్ కుమార్, ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పాటిల్, ఏఎస్పీ శరత్​ చంద్రపవార్, సాయిచెతన్య, ఓఎస్డీ సురేష్ కుమార్​, ఎస్పీ అటాచ్ ఎస్పీ ఖాసీం, సీఐ శివప్రసాద్, నాగబాబు, ఎస్సై తిరుపతి ఉన్నారు.