- ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ
ముంబై: లాక్ డౌన్ తర్వాత రిథమ్ దొరికించుకోవడంలో బౌలర్లకే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అన్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి కనీసం ఎనిమిది వారాలైనా సమయం పడుతుందన్నాడు. సుదీర్ఘ విరామం నుంచి గాడిలో పడటానికి ప్లేయర్లు చాలా కష్టపడాల్సి ఉంటుందన్నాడు. బౌలర్లు పూర్తిస్థాయిలో టెస్ట్లు ఆడాలంటే 8 నుంచి 12 వారాలు, వన్డేలకు 6 వీక్స్, టీ20లకు 5 నుంచి 6 వారాల సమయం పడుతుందని ఐసీసీ ఇంతకుముందే ప్రకటించింది. అయితే బ్యాట్స్మన్, బౌలర్లలో ఎవరికీ ఇబ్బందులు ఎక్కువన్న ప్రశ్నకు స్పందించిన బ్రెట్ లీ.. ‘ఇద్దరికీ ఇబ్బందే. ఎందుకంటే దాదాపు రెండు నెలల సుదీర్ఘ విరామం వచ్చింది. దీంతో ప్లేయర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కనీసం చాలా మంది రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి రిథమ్ దొరకడం బౌలర్లకు చాలా ఇబ్బంది. ఇంట్లో ఉండే ప్రదేశాల్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేస్తున్నా వాటితో ఫిట్నెస్ అంతగా రాదు. పూర్తి స్థాయిలో మ్యాచ్ ఫిట్నెస్ సాధించాలంటే ఎనిమిది వారాల ప్రాక్టీస్ అవసరం.
అప్పటివరకు బౌలర్లు కసరత్తులు చేస్తూనే ఉండాలి. ఇలా చేసినప్పుడే మైదానంలో మునుపటి తీవ్రతతో మ్యాచ్ ఆడగలుగుతారు’ అని ఆసీస్ తరఫున 76 టెస్ట్లు, 221 వన్డేలు ఆడిన లీ వ్యాఖ్యానించాడు. కరోనా వైరస్ను పక్కనబెట్టి లాక్డౌన్లో ఇచ్చిన సడలింపులతో కొంత మంది క్రికెటర్లు అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఈనెల 21న ఇంగ్లండ్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్.. మైదానంలో బౌలింగ్ ప్రాక్టీస్ చేయగా, టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ కూడా దేశవాళీ ప్లేయర్లతో కలిసి బౌలింగ్ కసరత్తులు చేశాడు.