Breaking News

పథకాలతో అందరి జీవితాల్లో వెలుగులు

సంక్షేమ పథకాలతో అందరి జీవితాల్లో వెలుగులు

సారథి న్యూస్, నరసన్నపేట: ప్రజారంజక సంక్షేమ పథకాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్​జగన్​మోహన్​రెడ్డి చిరకాలం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నరసన్నపేట పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి వైఎస్సార్ ​జంక్షన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇడుపులపాయలో మొదలుపెట్టి 14 నెలల పాటు 3,648 కిమీ. పొడవునా 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగిసిన విషయాన్ని గుర్తుచేశారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసి, దాని నుంచే మేనిఫెస్టోను తయారుచేసి ఇప్పటికే 90 శాతం హామీలను అమలుచేసి, నిజమైన ప్రజానాయకుడిగా సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి నిలిచారని కొనియాడారు. ఏడాదిన్నర కాలంలో శ్రీకాకుళం జిల్లాకు భావనపాడు పోర్ట్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఉద్దానం మంచినీటి పథకం, షిప్పింగ్​హార్బర్లు, సీతంపేట, పలాసలో 200 పడకల ఆస్పత్రులు సహా ఎన్నో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. చిరువ్యాపారులను స్వయంగా కలిసి వారిని పలకరించి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చిరు వ్యాపారులకు అందించే వడ్డీలేని రూ. 10 వేల రుణాన్ని వారికి అందేలా చూడాలని సహాయకులను ఆదేశించారు. దారిలో ఆర్టీసీ బస్సులో వెళుతున్న వారిని పలకరించి ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. కేక్ కట్ చేసి వలంటీర్లకు తినిపించారు. అంతకుముందు ఆయన పాదయాత్రలో భాగంగా భారతరత్న డాక్టర్ బీఆర్​అంబేద్కర్, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తనయుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య, పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గంలోని కార్యకర్తలు పాల్గొన్నారు.