Breaking News

నిద్రమాత్రలు ఇచ్చి.. సంచుల్లో చుట్టేసి

నిద్రమాత్రలు ఇచ్చి.. సంచుల్లో చుట్టేసి

– ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
– గీసుకొండ ఘటనలో విస్తుపోయే నిజాలు
– పోలీసుల అదుపులో ప్రధాన నిందితులు

సారథి న్యూస్​, వరంగల్‌: అనుకున్నదే జరిగింది.. బతికుండగానే బావిలోకి తోసేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో పాడుబడ్డ బావిలో 9 డెడ్​ బాడీస్​ వెలుగుచూసిన ఘటనలో సంచలనం వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. మూడు రోజులుగా సాగుతున్న విచారణలో పోలీసులు మిస్టరీని చేధించారు. మక్సూద్ కూతురు బుస్రా ప్రియుడు, బీహార్​ కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్​ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. భర్తతో విడిపోయిన మక్సూద్ కూతురు బుస్రా సంజయ్ కుమార్ యాదవ్ తో వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రచారం జరిగింది. బుస్రాకు తన తల్లితో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇంటిపై ఉంటున్న బీహార్‌కు చెందిన కార్మికులు శ్రీరాం, శ్యామ్‌ వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సంజయ్ కుమార్ స్నేహితులతో కలిసి నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక గోనె సంచుల సహాయంతో బతికుండగానే బావిలో పడేసినట్లు విచారణలో తేలింది. ఢిల్లీలో మక్సూద్‌ ఆలం అల్లుడు ఖతూర్‌ డైరెక్షన్‌లోనే వారందరినీ దారుణంగా హత్యచేశానని సంజయ్‌ చెప్పినట్లు సమాచారం. మక్సూద్‌ భార్య, కూతురుతో సంజయ్‌ వాట్సప్‌ చాటింగ్​ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, నిందితుడు సంజయ్​ కుమార్​ ను సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఎవరు వీళ్లు
పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం వరంగల్‌కు కుటుంబంతో సహా వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవారు. డిసెంబర్​ నెల నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండడంతో నెలన్నర నుంచి గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌తో పాటు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్రా ఆలం కూడా తన మూడేళ్ల కుమారుడితో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వీరితో పాటు గన్నీ సంచుల గోదాం పక్కనే ఉన్నపై భవనంలో బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంలు కూడా నివసిస్తూ గోదాంలో పనిచేస్తున్నారు

సంఘటన ఇలా..
గొర్రెకుంట శివారులోని బార్‌దాన్‌ కుట్టే గోదాంలో పనిచేసే మహ్మద్‌ మక్సూద్‌ ఆలం (55), అతడి భార్య నిషా ఆలం(45), కూతురు బుస్రా ఖాతూన్‌ (20)తో పాటు ఆమె మూడేళ్ల కొడుకు గురువారం(ఈనెల 21) బావిలో శవాలై తేలారు. మరుసటి రోజు శుక్రవారం(22న) మక్సూద్‌ కుమారులైన షాబాజ్‌ ఆలం(19), సోహిల్‌ ఆలం (18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బీహార్‌ వలస కార్మికులు శ్యాం కుమార్‌షా (21) శ్రీరాం కుమార్‌షా(26) కనిపించకుండా పోవడం, సెల్‌ఫోన్లు స్విచ్​ ఆఫ్​ ఉండడంతో తొలుత వారిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం ఆ నలుగురి మృతదేహాలతో పాటు మక్సూద్‌కు సన్నిహితుడైన మహ్మద్‌ షకీల్‌(30) అనే డ్రైవర్‌ మృతదేహం బావిలో తేలింది.