Breaking News

నయీం కేసు.. పోలీసులకు క్లీన్​చీట్​

కరుడుగట్టిన గ్యాంగ్​స్టర్​ నయీంను 2016 ఆగస్టు 8న పోలీసులు ఎన్​కౌంటర్​ చేసిన విషయం తెలిసిందే. అయితే నయీం ఎన్​కౌంటర్​ తర్వాత అతడి అక్రమాలు ఒక్కొక్కటీ బయటికొచ్చాయి. నయీం పోలీసులను అడ్డుపెట్టుకొని అనేక​ అక్రమాలు చేశాడని వార్తలు వినిపించాయి. అప్పట్లో నయీం అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సిట్​తో దర్యాప్తు చేయించింది. అయితే దర్యాప్తు చేసిన సిట్..​ నయిం అక్రమాల్లో పోలీసుల పాత్ర ఏమీలేదని తేల్చిచెప్పింది. నయీం భూ అక్రమాలకు సహకరించినట్టు పలువురు ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారులపై ఆరోపణలు వచ్చాయి.

డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి ఉన్నతాధికారులూ ఉన్నారు. అయితే విచారణ జరిపిన సిట్​.. నయీం అక్రమాల్లో పోలీసుల తప్పు ఉన్నట్టు తమకు ఆధారాలు దొరకలేదని పేర్కొన్నది. అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, డీఎస్పీలు సీహెచ్ శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, సాయి మనోహర్ ప్రకాశ్ రావు, వెంకటనర్సయ్య, అమరేందర్ రెడ్డి, తిరుపతన్నలకు క్లీన్ చిట్ ఇచ్చింది. సీఐలు రవికిరణ్రెడ్డి, బలవంతయ్య, నరేందర్ గౌడ్, రవీందర్‌లకు కూడా సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. నయీమ్‌కి రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తేల్చింది. వివిధ ప్రాంతాల్లో 1,019 ఎకరాల భూములు, 29 భవనాలు ఉన్నాయి. వీటితోపాటు 2 కేజీల బంగారం, రూ.2కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.