సారథి న్యూస్, హుస్నాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప దార్శనికుడని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. ఆదివారం జరగబోయే పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో వొడితెల కుటంబానికున్న సంబంధాన్ని శుక్రవారం గుర్తుచేసుకున్నారు. పీవీ సాహితీవేత్తగా ఓ వైపు మరో వైపు పరిపాలనా దక్షుడిగా ఉంటూ మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపించి అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు, సాంకేతిక రంగాల అభివృద్ధి చెందితే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన వారమవుతామని చెప్పిన గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు.
కేంద్రంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసి ప్రపంచ దేశాల్లోని రాజకీయ, వాణిజ్య సంబంధాలను పటిష్టం చేశారని పేర్కొన్నారు. పీవీ దక్షిణాది రాష్ట్రాల నుంచి తొలి ప్రధానిగా కీర్తిప్రతిష్టలు తెచ్చుకోవడమే కాకుండా ఆయన స్వగ్రామం హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం కావడం మన ప్రాంతానికి ఎంతో గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవలను గుర్తించి పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమన్నారు.